టీఆర్ఎస్‌లోకి దిల్ రాజు… అక్క‌డ నుంచే పోటీ…?

తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఇది కొత్త న్యూస్‌ కాదు. ఆయ‌న‌ గత ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు వ్యాపారపరంగా మరింత ముందుకు దూసుకు పోయారు. ఈ క్రమంలోనే ఆయన చూపు వచ్చే ఎన్నికలపై పడినట్టు తెలుస్తోంది.

నిజామాబాద్ దిల్ రాజు సొంత జిల్లా. ఇప్పటికే ఆయన పలు సేవా కార్యక్రమాల ద్వారా అక్కడి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన గులాబీ కండువా క‌ప్పుకోనున్న‌ట్టు కూడా తెలుస్తోంది. దిల్ దిల్ రాజుది రెడ్డి సామాజిక వర్గం. నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. దిల్ రాజు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతలతో రాయబారాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజు ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? ఎంపీగా పోటీచేస్తారా? అనేది త్వరలోనే తేలనుంది. ఆయ‌న‌కు ఇప్ప‌టికే శాస‌న‌మండ‌లి, రాజ్య‌స‌భ లాంటి ఆఫ‌ర్లు ఉన్నా కూడా ఆయ‌న మాత్రం ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల నుంచే ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక కావాల‌ని చూస్తున్నార‌ట‌. దిల్ రాజు నైజాం పంపిణీ మార్కెట్‌ను శాసిస్తున్నారు. నైజాం కింగ్‌గా ఆయ‌న పేరు పొందారు.

ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా సినిమా వాళ్ల‌ను బాగా ఎంక‌రేజ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే దిల్ రాజు లాంటి అంగ‌, ఆర్థిక బ‌లాలు ఉన్న సినిమా నిర్మాత‌ను త‌మ పార్టీలో చేర్చుకుని ఆయ‌న‌కు టిక్కెట్ ఇస్తే సినిమా రంగంలోనూ త‌మ‌కు మంచి ప‌ట్టు దొరుకుతుంద‌నే భావిస్తోంది. గ‌తంలో సినిమా నిర్మాత‌లు రామానాయుడు టీడీపీ నుంచి బాపట్ల ఎంపీగా గెలిచారు. అశ్వ‌నీద‌త్ విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మ‌రో నిర్మాత‌, న‌టుడు ముర‌ళీమోహ‌న్ రాజ‌మండ్రి ఎంపీగా గెలిచారు. మ‌రి రాజు ల‌క్ ఎలా ఉందో చూడాలి.