బర్త్ డే స్పెషల్..నందమూరి ఫ్యాన్స్‌కు ఎన్ని సర్‌ప్రైజెస్ అంటే..?

నందమూరి నట సింహం బాలకృష్ణ బర్త్ డే అంటే నందమూరి వంశానికే కాదు, అభిమానులకు కామన్ ఆడియన్స్‌కు పెద్ద పండగలాంటిది. ఆరోజు బాలయ్య ఊపిరి తీసుకునేంత సమయం కూడా ఏ ఒక్కరు ఇవ్వరు. శుభాకాంక్షలతో అటు ఆయన ఫోన్ మోగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులు చేసే సందడి..సినీ ప్రముఖులు తెలిపే స్పెషల్ విషెస్, అటు రాజకీయంగా ఆయన కార్యకర్తలు, ఇతర నాయకు బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ హోరెత్తిస్తుంటారు.

ఇదంతా సరే మరీ నందమూరి సినీ లవర్స్‌కు ఈసారి ఏ గిఫ్టులు ఉండబోతున్నాయి. ఎలాంటి సర్‌ప్రైజెస్ రాబోతున్నాయి..ఇదే ఇప్పుడు అభిమానులందరిలోనూ ఆసక్తికరంగా సాగుతున్న చర్చలు. ఈనెల 10వ తేదీన(జూన్ 10) బాలయ్య బాబు బర్త్ డే. ఈ పుట్టినరోజుతో ఆయనకు 61ఏళ్ళు పూర్తై 62వ ఏట అడుగుపెడతారు. అయితే, ఈసారి బాలయ్య బర్త్ డేకు ప్రస్తుతం చేస్తున్న సినిమా నుంచి అలాగే, కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ రాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ప్రస్తుతం యాక్షన్ సినిమాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య వాస్తవ సంఘటన ఆధారంగా ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చక చకా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా నుంచి బాలయ్య బర్త్ డే నాడు టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ టీజర్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ అని అంటున్నారు. ఇక పటాస్ సినిమా నుంచి వరుస హిట్స్‌తో దూసుకెళుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాను బాలయ్యతో చేయబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను అలాగే బాలయ్య లుక్‌ను వదులుతారనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా బాలయ్యతో తీసే సినిమా ఉంటుందని స్వయంగా ఇటీవల అనిల్ చెప్పుకొచ్చాడు. దాంతో గ్యారెంటీగా బాలయ్య ఖాతాలో భారీ హిట్ ఖాయమని అభిమానులు ఇప్పటి నుంచే ఫిక్సైపోతున్నారు. అలాగే, బాలయ్యను ఇప్పటివరకు చూపించనంత ఎనర్జిటిగ్‌గా పైసా వసూల్ సినిమాతో చూపించి ఫ్యాన్స్‌తో ఈలలేయించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలయ్యతో రూపొందబోతున్న సినిమాను ప్రకటించనున్నారట. అంతేకాదు, ఎవరూ ఊహించని “బాలా” అనే మాస్ టైటిల్‌ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల బాలక్రిష్ణ తండ్రి నందమూరి తారకరామారావు 100వ జయంతి సందర్భంగా బాలయ్య మొదలుపెట్టిన సొంత నిర్మాణ సంస్థ బసవతారకరామ క్రియేషన్స్‌లోనూ బాలయ్య కొత్త సినిమా ప్రకటన రాబోతుందని సమాచారం. మొత్తానికి బాలయ్య బర్త్ డే రోజున సర్‌ప్రైజెస్‌కు కొదవుండదని చెప్పుకుంటున్నారు.

Share post:

Latest