NBK107లో వైసీపీని బాల‌య్య ఇంతలా టార్గెట్ చేస్తున్నాడా..!

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయ‌న న‌టిస్తోన్న #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్‌కు ఈ మార్కులు నిద‌ర్శ‌నం.

ఇక సినిమాలో బాల‌య్య డైలాగులు చెపుతుండ‌గా పులిజ‌ర్ల అని రాసి ఉంటుంది. ఈ పేరు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోలిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు. ఇక టీజ‌ర్‌లో మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్ అనే డైలాగ్ తో పాటు భయం నా బయోడేటాలోనే లేదురా బోషిడికే అనే డైలాగ్ కూడా తాజా రాజ‌కీయాల‌ను ప్రతిబింబిస్తూ ఏపీలో అధికార వైసీపీని టార్గెట్ చేసిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మీడియా సమావేశంలో బోషిడికే అన‌డంతో పట్టాభిని అరెస్టు చేసి జైలులో కూడా పెట్టారు. ఇప్పుడు బాల‌య్య త‌న సినిమాలో అదే డైలాగ్ వేశారు. అటు నా జీవో గాడ్స్ ఆర్డ‌ర్ అన‌డంతో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న‌ట్టుగా కూడా క‌నిపిస్తోంది. పైగా బాల‌య్య ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

దీంతో ఇది మ‌రింత హాట్ టాపిక్ అయ్యింది. ఇక బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ‌లో కూడా శీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి.. నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా అన్న డైలాగ్ మాజీ మంత్రి నాని ని ఉద్దేశించి చెప్పిందే అన్న చ‌ర్చ‌లు అప్ప‌ట్లో జ‌రిగాయి. మ‌రి ఈ డైలాగుల‌పై రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత ర‌చ్చ జ‌రుగుతుందో ? చూడాలి.

Share post:

Popular