వైసీపీలో ఇలాంటి నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు..!

`ఔను! అధికార పార్టీ వైసీపీలో ఇంత అన్యాయానికి.. గురైన నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు!!“ అంటు న్నారు గుంటూరు ప్ర‌జ‌లు. వైఎస్ కుటుంబంతో న‌డిచి.. జ‌గ‌న్ మాట‌ను న‌మ్మి.. న‌ట్టేట మునిగిన నాయ‌కు డు.. వైసీపీ హిస్ట‌రీలో ఆయ‌న ఒక్క‌డే అంటే.. అతిశ‌యోక్తి కూడా కాద‌ని చెబుతున్నారు. ఆయ‌నే చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. క‌మ్మ సామాజిక‌వ ర్గానికి చెందిన మ‌ర్రి.. నిజాయితీ ప‌రుడిగా పేరు తెచ్చుకున్నారు. త‌న కుటుంబ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫున ఒక‌సారి విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. వైఎస్ అనుచ‌రుడిగా మారిపోయారు.

వైఎస్ అకాల మ‌ర‌ణం చెందిన‌ప్పుడు.. మూడు రోజుల పాటు అన్నంనీరు ముట్టుకోకుండా.. తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన నాయకుడు. త‌ర్వాత‌.. జ‌గ‌న్ కోసం.. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి..ఆయ‌న‌తో న‌డిచారు. 2014లో చంద్ర‌బాబు హ‌వా నేప‌థ్యంలో టికెట్ ఇచ్చినా.. విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. అయిన‌ప్ప‌టి కీ.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఒక్కరినీ క‌లిసి.. పార్టీని బ‌లోపేతం చేశారు. వైసీపీకి ఓటేస్తే..ఏం జ‌రుగుతుంది.. మ‌రింత‌గా దోచుకుంటారు.. అంటూ.. ఇక్క‌డి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు.. ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. పార్టీకిడ్యామేజీ చేసే ప్ర‌య‌త్నం చేస్తే.. దీనిని దీటుగా ఎదుర్కొని … గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ పేరుతో మ‌ర్రి పార్టీని ఇక్క‌డ బ‌తికించారు.

బీసీ సామాజిక వ‌ర్గాన్ని ముఖ్యంగా క‌లుపుకొని పోతూ.. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌ను తెలుసుకుంటూ.. 2019లో విజ‌యం కోసం.. పునాదులు వేసుకున్నారు. ప్ర‌త్తిపాటి దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ కూడా అయ్యారు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ఎన్నిక‌ల‌కు ముందు.. తాను పోటీ చేయాల్సి ఉన్నా.. పార్టీ అధినే తగా జ‌గ‌న్ చెప్పిన మాట‌కు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపున‌కు మ‌ర్రి ఆగిపోయారు. త‌న సీటును త్యాగం చేశా రు. “అన్నా.. మ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే.. నిన్ను ఫ‌స్ట్ మినిస్ట‌ర్‌ను చేసే బాధ్య‌త నాది!.. న‌న్ను న‌మ్ము“ అని జ‌గ‌న్ చెప్పిన మాట‌తో మురిసిపోయారు.

ఇక‌, అప్ప‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున టికెట్ పొంది, ప్ర‌స్తుతం మంత్రి అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ విజ‌యం లోనూ మ‌ర్రి ప్ర‌ముఖ పాత్ర పోషించారు. జ‌గ‌న్ సీఎం అయ్యేందుకు మ‌ర్రి అహ‌ర‌హం శ్ర‌మించారు. అయితే.. జ‌గ‌న్ సీఎం అయ్యారు. కానీ, మ‌ర్రికి ఇచ్చిన మాట మాత్రం నిల‌బ‌డ‌లేదు. క‌నీసం.. ఇప్పుడైనా.. రెండో ద‌ఫా మంత్రి వ‌ర్గంలో అయినా..త‌న‌కు ఛాన్స్ చిక్కుతుంద‌ని కొండంత ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, అది కూడా తేలిపోయింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ర్రి ఎలా ఉన్నా.. ఆయ‌న అభిమానులు.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు మాత్రం ఆయ‌న‌కు అండ‌గా ఉన్నారు. ఇంత‌గా న‌ష్ట‌పోయినా.. నాయ‌కుడు లేరంటూ.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి మ‌ర్రి త‌న దారి తాను చూసుకుంటారా? లేక‌.. ఏం చేస్తారు? అనేది చూడాలి.