కేజీఎఫ్ చాప్టర్ 2 రివ్యూ అండ్ రేటింగ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు దక్కిన భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సీక్వెల్ చిత్రం అయిన ‘కేజీఎఫ్ 2’తోనూ కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. మరి రాఖీ భాయ్ కేజీఎఫ్ 2 ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
కేజీఎఫ్ 1 కథ ఎక్కడ ముగుస్తుందో, అక్కడి నుండే కేజీఎఫ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆనంద్ వసిరాజు(అనంత్ కొడుకు) విజయేంద్ర వసిరాజు(ప్రకాశ్ రాజ్) కేజీఎఫ్ 2 కథను ఓ టీవీ జర్నలిస్ట్‌కు వివరిస్తుంటాడు. ఈ క్రమంలో నరాచిలో రాఖీ భాయ్(యశ్) తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు.. కేజీఎఫ్‌ను సొంతం చేసుకునేందుకు ఎంతో మంది డాన్‌లు రెడీ అవుతుంటే, వారందరినీ కాదని రాఖీ దాన్ని ఎలా దక్కించుకున్నాడు.. ఈ క్రమంలో ఇండియన్ గవర్న్‌మెంట్ మరియు అధీరా గ్యాంగ్ ఈ రెండు సిస్టమ్స్‌తో రాఖీ ఎలా ఢీకొన్నాడు అనేది కేజీఎఫ్ 2 కథగా మనకు చూపించారు.

విశ్లేషణ:
కేజీఎఫ్ తొలి భాగంలో కథ చాలా బలంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఉండే ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే కేజీఎఫ్ 2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా థిన్‌గా ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 1 మేనియా నుండి ఇంకా బయటపడినట్లు మనకు కనిపించదు. అందుకే కేజీఎఫ్ 2 లోనూ తన దృష్టి మొత్తం కథపై కాకుండా హీరో ఎలివేషన్స్‌పైనే ఫోకస్ పెట్టాడు.

దీంతో కేజీఎఫ్ 2 కథ అక్కడక్కడా పట్టాలు తప్పినట్లు సదరు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలోని మాస్ అంశాలు మాత్రం మరో లెవెల్‌లో ఉండటంతో వారు ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇక హీరో ఎలివేషన్స్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఒకటి కాదు రెండు కాదు.. ఈ సినిమాలో పలుసార్లు హీరోను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అటు కథలో బలం లేకపోవడంతో కేవలం హీరోపైనే ఆధారపడినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర అధీరాను ఓ రేంజ్‌లో చూపిస్తారని అందరూ అనుకుంటారు. కానీ అతడి ఇంట్రో వరకే ఆ ఎలివేషన్స్‌ను వాడుకుని, ఆ తరువాత అతడిని కూడా ఓ సాధారణ విలన్‌గా ప్రెజెంట్ చేయడంతో ప్రేక్షకుల్లో అతడి పాత్రపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ బ్లాక్స్ భారీగా ప్లాన్ చేయడంతో ‘కేజీఎఫ్’ డైహార్డ్ ఫ్యాన్స్ సంతోషంతో థియేటర్ల నుండి బయటకు వస్తారు. కానీ కామన్ ఆడియెన్స్ మాత్రం ఇంతేనా… అంటూ ఇంటిబాట పడతారు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
రాఖీ భాయ్‌గా హీరో యశ్ మరోసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్, హీరోయిజం లాంటి అంశాల్లో మనోడు తోపు అని మరోసారి రుజువు చేసుకున్నాడు. అటు అధీరా పాత్రలో సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్బ్‌గా ఉంటుంది. రమికా సేన్ పాత్రలో రవీనా టండన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీనిధి శెట్టి తన పాత్రను అలాగే కంటిన్యూ చేసి మెప్పిస్తుంది. మిగతా వారు తమ పాత్రల మేర బాగానే చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సక్సెస్‌తో సీక్వెల్ చిత్రాన్ని మరింత భారీతనంగా తీయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను తెరకెక్కించాడనే విషయం సినిమా చూసిన ఎవరైనా చెబుతారు. అయితే కథపై పట్టును కోల్పోయి కేవలం హీరో ఎలివేషన్స్‌కే అతడు ప్రాధాన్యత ఇవ్వడం కొంతమేర డిజప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఇక కథలోని ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను పర్ఫెక్ట్‌గా ప్లేస్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సినిమాటోగ్రఫీ పనితనం సూపర్ అని చెప్పాలి. ఎడిటింగ్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. రవి బస్రూర్ మ్యూజిక్, ముఖ్యంగా బీజీఎం మామూలుగా ఉండదు. హొంబాలే నిర్మాణ విలువలు ఏ రేంజ్‌లో ఉన్నాయో, ఈ సినిమాలోని రెండు మూడు సీన్స్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

చివరగా:
కేజీఎఫ్ 2 – కేవలం రాఖీ భాయ్ కోసమే!

రేటింగ్:
3.25/5.0