రీమేక్‌లనే నమ్ముకున్న పవన్.. ఇలా అయితే కష్టం బాసూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందంచడంతో పవన్ మార్క్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, పవన్ ఇప్పుడు మరో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘వినోధయ సీతం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ మాటల సాయం అందించేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఇలా వరుసగా రీమేక్ సినిమాలనే నమ్ముకోవడంపై పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కొంతమేర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్న సినిమాలను పవన్ ఎక్కువగా ఎంచుకోవడం ఏమిటని వారు ప్రశ్ని్స్తున్నారు. తెలుగులో దర్శకులు లేరా, తెలుగు రచయితల కథలు బాగుండటం లేదా అంటూ వారు అడుగుతున్నారు. ఇలా వరుసగా రీమేక్ చిత్రాలనే నమ్ముకుంటే, అసలుకే మోసం అవుతుందని వారు అంటున్నారు. ఏదేమైనా పవన్ ఇకనైనా సెలెక్టివ్ గా సినిమాలు చేయడంతో పాటు తెలుగు కథలను ఎంచుకుంటే బెటర్ అని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.