జగన్ మళ్లీ ఔదార్యం ప్రదర్శిస్తారా?

రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత ముఖ్యమైన వారు ఆశించేది రాజ్యసభ సభ్యత్వం! అంతూ దరీ లేకుండా పార్టీనే నమ్ముకుని.. రాత్రింబగళ్లూ పార్టీకే సేవ చేస్తూ ఉండే నాయకులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు.. తమకు పార్టీ ఏదో ఒక సందర్భంలో సముచితమైన పదవులు కట్టబెడుతుందనే.. ఆశతో బతుకుతుంటారు. పార్టీకి ఎన్ని అవకాశాలు వచ్చినా.. ఆ అవకాశాల సంఖ్యకు రెట్టింపుగానే ఆశావహులు ఉంటారు. ప్రతిసారీ కొందరికి నిరాశ తప్పదు. అయితే.. తమాషా ఏంటంటే.. పార్టీకి దక్కిన అవకాశాలను కూడా ఒక్కోసారి పార్టీకి సంబంధం లేని ఇతర వ్యక్తులు తన్నుకుపోతూ ఉంటారు.

అధినాయకులకు అవసరాలు, ఆబ్లిగేషన్లు లేదా ఔదార్యం ఎక్కువైనప్పుడు ఇలాగే జరుగుతుంటుంది.

ఈ ఏడాది రాజ్యసభ సభ్యుల విషయంలో అదే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంకా చాలా సమయం ఉంది గానీ.. ఊహాగానాలకు కొదవేముంది. ఈ సారి జగన్ రాజ్యసభలో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు. అనేది పార్టీలో ఎంత కీలకంగా చర్చ జరుగుతోందో.. అదే సమయంలో.. జగన్ ఈసారి కూడా ఎవరో బయటివారికి ఎంపీ సీటును దానం చేసేస్తారా? అనే భయం కూడా ప్రచారం అవుతోంది.

ఈ ఏడాదిలో రాజ్యసభలో మొత్తంగా 77 మంది సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఏపీ నుంచి నలుగురు ఉన్నారు. వారిలో విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, సురేష్ ప్రభు ఉన్నారు. అప్పట్లో బీజేపీతో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోడానికి ఒక ఎంపీస్థానాన్ని అప్పటి కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు అప్పజెప్పారు. టీజీ వెంకటేష్, సుజనా చౌదరి సరేసరి.

ప్రస్తుతం శాసనసభలో ఉన్న సభ్యుల బలాన్ని బట్టి చూసినప్పుడు మొత్తం నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డికి ఎటొచ్చీ పదవిని కొనసాగిస్తారు. మిగిలిన మూడుస్థానాలను జగన్ ఎవరికి పంచిపెడతారనే చర్చ పార్టీలో సహజంగానే జరుగుతోంది. అయితే మూడు స్థానాలూ పార్టీకే దక్కుతాయా? వీటిలో ఒక స్థానాన్ని మరెవరికైనా దానం చేస్తారా? అనేది పార్టీని వెన్నాడుతన్న భయం.

గతంలో ఇదే తరహాలో ఎంపీ పోస్టులు వచ్చినప్పుడు.. జగన్ ఒక స్థానాన్ని అంబానీ ఆబ్లిగేషన్ మీద ఆయన మిత్రుడు పరిమళ్ నత్వానీ కి కేటాయించారు. ఆ సమయానికి పరిమళ్ నత్వానీ వైసీపీ అభ్యర్థిగానే నామినేషన్ వేసి ఎంపీ అయ్యారుగానీ.. పార్టీతో ఆయన అనుబంధం సున్నా. ఆయనను ఎంపీ చేయడం వలన అంబానీ గ్రూపు రాష్ట్రానికి చాలా ఒరగబెడుతుందని అనుకున్న అందరి అంచనాలు కూడా తప్పాయి.

ఈసారి జగన్ కు మళ్లీ నలుగురిని ఎంపీ చేసే అవకాశం వచ్చింది. నాలుగుస్థానాలూ పార్టీ వారికే ఇస్తారా.? గతంలో నత్వానీ తరహాలో.. ఆబ్లిగేషన్లకు లొంగి ఏదైనా స్థానాన్ని త్యాగం చేస్తారా? అని పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.