సినిమా రాజకీయాలు.. ప్రమాద ఘంటికలు!!

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కేపీహెచ్బీ కాలనీ లోని శివ పార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి థియేటర్ మొత్తం దాదాపు అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాస్తూ అగ్నిప్రమాద సమయంలో ప్రేక్షకులు ఎవ్వరు థియేటర్లో లేకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం పలు విషయాల చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం వర్సెస్ ప్రభుత్వం అన్నంత రేంజ్ లో వార్ నడుస్తోంది. ప్రభుత్వం పనిగట్టుకుని సినిమా రంగం మీద కక్ష సాధింపుతో టికెట్ రేట్ల తగ్గింపు ఒకవైపు, థియేటర్ల పైన రైడ్ వంకతో థియేటర్లు మూసివేయడం మరోవైపు అంటూ ప్రభుత్వాన్ని నిందించడం చూస్తున్నాం ఇక్కడ అ శివ పార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం బాధ్యులెవరు? సరైన ప్రమాణాలు పాటించని థియేటర్ యాజ యజమాన్యమా? లేక ప్రమాణాలు పాటించక పోవడాన్ని చూసీచూడనట్టు వ్యవహరించిన ప్రభుత్వానిదా? బాధ్యులు ఎవరైనా బాధితులు మాత్రం సామాన్య ప్రజలే అవుతారు.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వ విషయానికి వద్దాం సరిగ్గా ప్రమాణాలు పాటించని థియేటర్లను తనిఖీ చేసి సీజ్ చేయడం కక్షసాధింపు! ఒకవేళ ఇదే ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో సంభవించి ఉంటే దాని పర్యవసనాలు ఏ రకంగా ఉండేవో ఊహకు కూడా అందదు. ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటే కక్షసాధింపు అనే ముద్ర.. ఇది ఏ రకమైన సంప్రదాయం! టికెట్ల రేట్లు సవరించడం అయినా, థియేటర్ల తనిఖీలు అయినా ప్రజా పరిరక్షణ దృష్టికోణంలో చూడాలే తప్ప కుల కోణం, వర్గ కోణంలో చూడటం దుర్మార్గం.

ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఒకసారి గమనిస్తే గుళ్ళూ గోపురాల పైన దాడులు, మతం పైన దాడులు, కులం పైన దాడులు, ప్రాంతం పైన దాడులు తాజాగా సినిమా పరిశ్రమ పైన దాడులు ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన విమర్శలు! పైన పేర్కొన్న ఏ ఒక్క దానికి కూడా విమర్శ అనబడే అర్హత కూడా లేదు సామాన్యుడి నడ్డి విరిచే ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించాలి కానీ సామాన్యుడికి వెన్నుదన్నుగా నిలిచే నిర్ణయాల్ని విమర్శించే రాజకీయ కుసంస్కృతికినూ, దానికి వంతపాడే మీడియా చౌకబారు తనానికినూ మనం సిగ్గుపడటం పడదాం!!
— కల్కి