అందుకే బాబు కుప్పం టూర్..

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలు పెడితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ ప్రాభవం కోల్పోయింది. అధికార వైసీపీ వైపే జనం మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ముందనుంచీ కుప్పంలో టీడీపీ పాగా వేసింది. చంద్రబాబు నాయుడు అంటే కుప్పం గుర్తుకొస్తుంది. అటువంటి కుప్పం ఇపుడు ఫ్యాను కింద చేరిపోయింది. దీనిని పార్టీ చీఫ్ చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు.

ఎక్కడ ఓడిపోయినా పర్వాలేదు కానీ సొంతింట్లో ఓడిపోతే ఇక పరువేముంటుంది. కుప్పంలో జరిగిన ఎన్నికల తీరు గురించి, నాయకుల పనితీరు గురించి గతనెలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. అసలు ఎందుకిలా జరిగిందని నాయకులను గుచ్చి గుచ్చి అడిగినా వారినుంచి మౌనమే సమాధానమైందట. ఇంక కుప్పంను ఇలాగే వదిలేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని బాబు తీవ్రంగా ఆలోచించారట. అందుకే నేరుగా బాబే రంగంలోకి దిగారు. పోగొట్టుకున్న పరువును తిరిగి తెచ్చుకునే పనిలో పడ్డాడు. అసలేం జరిగిందో స్వయంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అనుకున్నాడు.

ఈనెల 6,7,8 తేదీలలో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తాడు. పర్యటనలో భాగంగా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలను కలిసి వివరాలు సేకరించనున్నాడు. అసలు పార్టీ పరిస్థతి ఇంతలా దిగజారి పోవడానికి కారణమేంటనే విషయాన్ని నేరుగా తెలుసుకుంటున్నాడు. పార్టీలో సమన్వయ లోపమేమైనా ఉందా? నాయకుల మధ్య విభేదాలున్నాయా? అనేది కార్యకర్తలతో మాట్లాడి సెట్ చేస్తాడట. మున్సిపల్ ఎన్నికలకు ముందు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ఓటమిపాలైన తరువాత మరీ ఇపుడు పర్యటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.