బాలయ్య కోసం ఇంకా ఎదురుచూపులే!

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాలయ్య తన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కు రుచిచూపించాడు. పూర్తిగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలవడమే కాకుండా బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా వసూళ్ల పరంపరను కొనసాగిస్తూ కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా కరోనా కాలం కావడం, ఏపీలో టికెట్ రేట్ల వివాదం నెలకొన్నప్పటికీ అఖండ చిత్రం వసూళ్లకు బాక్సాఫీస్ బెంబేలెత్తింది. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్‌తో ఈ సినిమా బాలయ్య పవర్‌ను మరోసారి ప్రూవ్ చేసింది. అంతేగాక షేర్ వసూళ్ల పరంగా ఈ సినిమా ఇంకా సాలిడ్ కలెక్షన్స్‌ను రాబడుతూ ఔరా అనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటడంతో ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు వేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ఇప్పట్లో అఖండ చిత్రం ఓటీటీలో టెలికాస్ట్ అయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది.

నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన 30 రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకునేలా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ అఖండ మేకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అఖండకు 30 రోజులు దాటినా కూడా అద్భుతమైన వసూళ్లు వస్తుండటంతో ఈ సినిమాను అప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదంటూ చిత్ర నిర్మాతలు మరియు బయ్యర్లు సదరు ఓటీటీ సంస్థను వేడుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను కాస్త వాయిదా వేస్తున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్ర హైలైట్‌గా నిలవగా, థమన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో బోయపాటి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మరి అఖండ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఇంకెన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Share post:

Popular