వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు యాత్ర మళ్లీ మొదలు!

తెలంగాణలో అధికారమే లక్ష్యగా పార్టీని ప్రారంభించి రాజకీయ కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ ను విమర్శించడంలో ముందున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ముందునుంచీ పోరాడుతూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగాలు రాక నిరాశచెంది ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు..ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత కుటుంబాల వద్దే దీక్ష చేస్తున్నారు. ప్రతి మంగళవారం వారిళ్ల వద్దే సర్కారుకు వ్యతిరేకంగా.. ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మధ్యలో వరి కొనుగోలు వ్యవహారంపై సర్కారు తీరును నిరసిస్తూ అన్నదాతకు మద్దతుగా ధర్నా చేశారు. ఈ కార్యక్రమాలకు తోడు రాజకీయ పార్టీగా నిత్యం మీడియాలో ఉండాలి కాబట్టి ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి. అందుకే పాదయాత్రను ఎంచుకున్నారు. పాదయాత్ర చేపడితే ఎప్పుడూ.. ప్రజల్లో ఉండవచ్చనేది ఆమె రాజకీయ సలహాదారులు ఇచ్చిన సలహా.

అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర మధ్యలో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష కూడా చేపడుతున్నారు. ఈ ప్రస్థానం ఇలా కొనసాగుతూ ఉండగా.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. దీంతో కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర ఆగిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 14 వరకు యాత్రచేసేందుకు వీలులేదు. గతనెల 11వ తేదీన నల్గొండ జిల్లాలోని కొండపాకగూడెంలో పాదయాత్ర ఆగిపోయింది. అప్పటి వరకు 21 రోజుల పాటు కొనసాగిన యాత్ర 283 కిలోమీటర్లు సాగింది. దాదాపు 150 గ్రామాలను షర్మిల పర్యటించారు. ఎక్కడ ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే యాత్ర ప్రారంభమవుతుందని వైటీపీ నాయకులు చెబుతున్నారు. ఈనెల కోడ్ ముగిసిన అనంతరం 17వ తేదీన పార్టీ అధినేత్రి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈమేరకు పార్టీ నాయకులు అప్పుడే ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.