విజయ్ సేతుపతి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్‌లోనూ అదిరిపోయే మార్కెట్‌ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న విజయ్ సేతుపతి.. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఉప్పెన, మాస్టర్ సినిమాలతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
ఈ విషయాలు పక్కన పెడితే.. చాలా మంది హీరోలుగా ఎదిగాక పెళ్లి చేసుకుంటారు. కానీ, విజయ్ సేతుపతి మాత్రం పెళ్లి అయ్యాకే హీరోగా ఎదిగాడు. పైగా పెళ్లి సమయానికి విజయ్ సేతుపతి వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఈయన జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే విజయ్ సేతుపతి లవ్‌స్టోరిలో చాలా ట్విస్ట్‌లే ఉన్నాయి.
సినిమాల్లోకి రాకముందు విజయ్ సేతుపతి దుబాయ్ లో ఉద్యోగం చేసేవాడు. అయితే ఆ సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా జెస్సీతో ఆయనకు పరిచయం ఏర్పడిందట. జెస్సీ కూడా దుబాయ్ లోనే ఉండేదట. ఇక చాటింగ్ ద్వారా విజయ్ సేతుపతి, జెస్సీలు స్నేహితులుగా మారగా.. ఆ తర్వాత వీరి స్నేహం కాస్త ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. కానీ, విజయ్ సేతుపతి – జెస్సీల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులూ అంగీకరించలేదట.
ఎన్నో సార్లు అడగగా అడగగా చివరకు వారి ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. విజయ్ సేతుపతి, జెస్సీలు కేవలం చాటింగ్ ద్వారానే పరిచయం చేసుకుని, ప్రేమించుకుని ,పెద్దలను ఒప్పించుకున్నారు. అయితే వీరిద్దరూ ఒకరికొకరు నేరుగా చూసుకున్నది మాత్రం ఎంగేజ్మెంట్ లోనేనట. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. ఇక పెళ్లి అయ్యాక భార్య ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన విజయ్ సేతుపతి గొప్ప నటుడిగా ఎదిగాడు.