వద్దన్నా పంపిస్తున్నారు..టీఆర్ఎస్ టూర్ పాలిటిక్స్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధిష్టానం ఇతర రాజకీయ పార్టీలకంటే ఓ స్టెప్ ముందే ఉంటుంది.. ఏసమస్య రాకపోయినా.. లేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో పార్టీ చీఫ్ కేసీఆర్ అందెవేసిన చేయి. అందుకే తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటారు. ఇతర పార్టీల నాయకులు కూడా తమ సన్నిహితులతో ఇదే చెబుతుంటారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు జిల్లాలో అధికార పార్టీకి మెజారిటీ కూడా ఉంది. ఆరుగురు అభ్యర్థులు కచ్చితంగా గెలిచే అవకాశముంది. అయినా.. ఓటర్లు జారిపోకుండా.. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని భావించిన హైకమాండ్ వారిని స్థానికంగా ఉంచకుండా విహారయాత్రలకు పంపుతోంది. కొందరికి వెళ్లడానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపుతోంది.

అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ ఉమ్మడి జిల్లాలో మండలి ఎన్నికలకు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు రోజు వరకు కారు పార్టీ అభ్యర్థులు గోవా, మైసూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలను చుట్టేస్తారు. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లు అంటే ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారంటే.. అదిలాబాద్ జిల్లాలో 937 మంది ప్రజాప్రతినిధులుండగా 717 మంది టీఆర్ఎస్ పార్టీ వారున్నారు. ఇక్కడ ఒక స్థానానికి ఎన్నిక జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు పోటీ ఉంది. మొత్తం 1324 మంది ఓటర్లుండగా 996 మంది టీఆర్ఎస్ పార్టీ వారు. ఖమ్మంలో 1026 మందికి గాను 490 మంది, మెదక్ లో 1026 మందికి గాను 777 మంది, నల్గొండలో 1271 మందికిగాను 991 మంది అధికార పార్టీకి చెందిన వారున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మిగతా చోట్ల ఒక్కో స్థానానికి పోటీ నెలకొంది. ఎన్నికలుజరిగే సమయానికి ఓటర్లంతా తమ ప్రాంతాల్లో దిగిపోతారు. ఇదండీ అధికార పార్టీ విహారయాత్రా ఎన్నికల పథకం.