ఇటీవల కాలంలో చిన్న సినిమాలు సైతం పెద్ధ విజయాన్ని సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఎవ్వరికీ పరిచయం లేని నటీ నటులతో సినిమా తీసి సక్సెస్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఇందులో భాగంగానే శివకళ్యాణ్ దర్శకుడిగా కెకె సినిమాస్ పతాకంపై కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం `తురుమ్ ఖాన్‌లు`.
డార్క్ హ్యూమర్ జానర్ లో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల హీరోగా నటించగా.. దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్ సింగంలు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్‌గా చరణ్ అంబటి, ఎడిటర్‌గా బొంతల నాగేశ్వర రెడ్డి పని చేశారు.
అలాగే గగన్ కె.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు విడుదల చేస్తూ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత శివకళ్యాణ్ మాట్లాడుతూ… `బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే వూరిలో పుట్టి గొడవపడుతూ లలిత, భారతి, పద్మలని చేరుకునేందుకు ఆరాటపడుతుంటే.. అక్కడే పుట్టిన శ్రీకృష్ణుడు ఆ చిక్కుముడిని ఎలా విప్పాడు అన్నదే “తురుమ్ ఖాన్‌లు“ చిత్ర కథ` అని తెలిపారు. ఈయన వ్యాఖ్యలతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. మరి ఈ చిన్న సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.