టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిరసన గళం వినిపించింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నాయకులకు నచ్చకపోయినా సరేలే అనుకొని మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసి ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని .. రాజకీయంగా ఇబ్బందులు పడి తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే పార్టీలోకి వచ్చిన తరువాత అధిష్టానం ఆయనను పీసీసీ చీఫ్ గా నియమించింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సుతారమూ ఇష్టం లేదు. ఆయనను నియమించడం అప్పుడే వద్దని కొందరు అధిష్టానానికి చెప్పారు కూడా. అయితే రాహుల్ గాంధీ మాత్రం రేవంతుడికే పగ్గాలు అప్పగించారు. పార్టీ పగ్గాలందుకున్న తరువాత రేవంత్ దూసుకుపోతున్నాడు. అసంత్రుప్త వాదులను బుజ్జగిస్తూ అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధిష్టానం ద్రుష్టికి తీసుకెళుతున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కసారిగా ఫైరయ్యాడు. అతని వైఖరి మారకపోతే వెంటనే పదవి నుంచి తొలగించి వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించానలి జగ్గారెడ్డి ఏకంగా అధిష్టానానికే లేఖ రాశాడు. పార్టీ నాయకులతో చర్చలు జరపకుండా, ఎవరినీ సంప్రదించకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇదిమంచి పద్ధతి కాదని విమర్శించారు.
సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించే విషయంలో ఆయన తనను సంప్రదించలేదని, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే అయిన తననే పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల ద్వారా తన ఇమేజి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. ఇక జగ్గారెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే టి. జయప్రకాష్ రెడ్డి కూడా రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తనను సంప్రదించలేదని, అందుకే తాను బాయ్ కాట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పరిణామాలు ఎటువెళ్లి ఎటు దారితీస్తాయో అర్థం కావడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులే మదనపడుతున్నారట.