ఈ లోకంలో తల్లి గర్భం, సమాధి మాత్రమే ఆడపిల్లలకు సురక్షితమని ఓ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో జరిగింది. సూసైడ్ నోట్ లో బాలిక రాసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి.
చెన్నైలోని మాంగాడుకు చెందిన 17 ఏళ్ల బాలిక పూందమల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక ఎంతసేపటికీ గదిలోనుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి లోపలికి వెళ్లి చూడగా ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.
ఆమె ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కీల్పాక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసు బృందం బాలిక గదిని పరిశీలించగా ఆమె రాసిన మూడు లేఖలు లభ్యమయ్యాయి. అందులో ఒక లేఖ ముక్కలు ముక్కలు చేసి ఉండడం గమనించిన పోలీసులు వాటిని ఒక్కటిగా చేసి చదవగా బాలిక రాసిన వాక్యాలు వారిని కూడా కంటతడి పెట్టించాయి.
‘ఉపాధ్యాయులు, బంధువులు ఎవరినీ కూడా నమ్మకూడదు. ఈ లోకంలో ఆడవారికి తల్లి గర్భం, స్మశానం మాత్రమే సురక్షితమైన ప్రాంతాలు. పాఠశాలలో కూడా రక్షణ లేదు.’ అని లేఖలో రాసి ఉంది. మాజీ టీచర్ కుమారుడి లైంగిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, అతడే తన చావుకు కారణం అంటూ ఆ బాలిక సూసైడ్ నోట్ లో రాసింది.అయితే ఆ యువకుడి పేరును మాత్రం బాలిక రాయలేదు.
దీనిపై బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె ఇంతకుముందు ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివిందని, ఆ పాఠశాలలోని టీచర్ కుమారుడు లైంగికంగా వేధించాడని, అతడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక అంతకుముందు చదివిన ప్రైవేట్ పాఠశాలలో, ఆమె స్నేహితుల వద్ద విచారణ జరిపారు. కాగా సోమవారం రాత్రి పోలీసులు బాలిక ఆత్మహత్యకు కారణమైన విఘ్నేష్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అతడు బాలిక మొబైల్ కి అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాలు పంపించి వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు.