కరోనా కొత్త వేరియెంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచదేశాలనూ తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియెంట్.. ఇప్పటికే ముప్పై నుంచి నలబై దేశాలకు పాకేసింది. భారత్‌లోనూ ఈ మహమ్మారి అడుగు పెట్టగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వేరియెంట్ తీవ్రత, వ్యాప్తి రేటు, లక్షణాలకు సంబంధించి వివిధ వాదనలు వినిపిస్తుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
అయితే తాజాగా దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ అన్బెన్ పిళ్లే.. ఒమిక్రాన్ లక్షణాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త వేరియెంట్ బారిన పడిన కొందరు రోగులు చల్లటి ప్రదేశంలో ఉన్నప్పటికీ రాత్రిళ్లు తీవ్రమైన చెమటలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు.
అలాగే ఒమిక్రాన్ బారిన పడిన రోగుల్లో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, పొడి దగ్గు, స్వల్ప జ్వరం వంటి లక్షణాలతో పాటుగా విపరీతమైన తలనొప్పి, అలసట, నీరసం, ఒళ్లు నొప్పులు వంటివి కూడా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అందులోనూ వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ లక్షణాలు మరింత అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు.
కాబట్టి, పైన లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆ జాగ్రత్త వహించకుండా వెంటనే టెస్ట్‌లు చేయించుకోండి. అలాగే బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సోషల్ డిస్టెన్స్.. ఈ మూడిటినీ అస్సలు మరచిపోకండి. మరియు డైట్లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.