సరే అనలేక.. సారీ అనలేక…

తెలంగాణ ముఖ్యమం‍త్రి, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు ఇపుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విద్యత్‌ చార్జీలు, బస్సు చార్జీల పెంపు వ్యవహారం కేసీఆర్‌ టేబుల్‌ మీదకు వచ్చింది. రాష్ట్రంలో అనేక రోజులుగా ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. దీంతో ఆయా సంస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చార్జీలు పెంచకపోతే సంస్థల మనుగడ కష్టమవుతుందని ఇప్పటికే అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సు, విద్యుత్‌ చార్జీలు పెంచేవిషయంలో సీఎం ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. పెంచడం ఇష్టంలేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఫైల్‌పై సంతకం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అసలే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3వేల నిరుద్యోగ భృతి, రూ. లక్ష పంట రుణం మాఫీ తదితరాలు ఇంకా అమలు కాకుండా అలాగే ఉండిపోయాయి.

కేసీర్‌ సీఎం సీటులో కూర్చొని మూడేళ్లవుతోంది. అమలు కాని హామీల జాబితా ఇంకా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ పార్టీని వేధిస్తోంది. కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులను జనం ఈ హామీల విషయంపై ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. అయినా.. వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. అయితే అమలు హామీలు చేయకపోవడం వల్లే హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని కొందరు సీనియర్‌నాయకులు పేర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో చార్జీలు పెంచితే పార్టీకి అది నష్టమని, ప్రతిపక్షాలు విమర్శించేందుకు అవకాశమిచ్చినట్లవుతుందని కారు పార్టీ సీనియర్లు కొందరు అధినేతకు చెప్పినట్లు సమాచారం. బస్సు, విద్యుత్‌ చార్జీల పెంపు వల్ల పల్లె ప్రాంత ప్రజల్లో నిరసన వ్యక్తమయ్యే ప్రమాదం కూడా ఉందని, ప్రతిపక్షాలు కావాలని నిరసన కార్యక్రమాలు చేపడతారని చెబుతున్నారు. అసలే వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో సమస్య అయి కూర్చుంది..ఈ పరిస్థితుల్లో మరో రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో బస్సు, విద్యుత్‌ చార్జీల పెంపు విషయంపై పునరాలోచించాలని నాయకులు సీఎంకు విన్నవించారట. అయితే ఆయా సంస్థల అధికారులు మాత్రం కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరి బాసు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Share post:

Latest