వాచ్‌మెన్‌గా ప‌ని చేసిన షియాజీ షిండే..ఎందుకో తెలిస్తే క‌న్నీలాగ‌వు!

షియాజీ షిండే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌రాఠీ న‌టుడు అయిన ఈయ‌న మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `ఠాగూర్` సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయమ‌య్యాడు. ఆ త‌ర్వాతి కాలంలో మోస్ట్ వాంటెడ్ విల‌న్‌గా గుర్తింపు పొందిన షియాజీ షిండే.. మరాఠి, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా న‌టించాడు.

అయితే ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న షియాజీ షిండే.. ఒక‌ప్పుడు ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించాడు. కొన్నాళ్లు వాచ్‌మెన్‌గా కూడా ప‌ని చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలో ఒక నిరుపేద‌ రైతు కుటుంబంలో జ‌న్మించిన షియాజీ షిండేకి నలుగురు అక్క‌చెల్లెళ్లు, ఒక సోద‌రుడు ఉన్నాడు. అసలే పేద కుటుంబం కావడంతో చదువులకు పెద్ద ఆటంకం కలిగింది.

ఏడవ తరగతి వరకు తన ఊరిలోనే చదువుకున్న షియాజీ షిండే.. ఆ తరువాత పక్క ఊరికి వెళ్లి పదవ తరగతి పూర్తి చేశాడు. ఆపై ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేరగా.. అక్క‌డ‌ ఫీజులు కట్టలేక ఎంత‌గానో న‌లిగిపోయాడు. ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో తెలియ‌క‌.. కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్‌తో మాట్లాడి తాను చ‌దువుకున్న కాలేజీకే వాచ్‌మెన్‌గా మారాడు.

అలా మూడు సంవత్సరాల పాటు పగలు కాలేజీకి వెళ్లడం, రాత్రి పూట ఆ కాలేజీ కే వాచ్‌మెన్‌ గా పనిచేయడం లాంటివి చేశాడు. అలా వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజు కట్టి.. చదువులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ధార్మియ అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. చాలామంది షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు. దాంతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం ద‌క్కింది.