టీడీపీలో బీసీ రాష్ట్ర నేత దాస‌రి శేషుకు ఇన్ని అవ‌మానాలా…!

తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంలో ఈ వ‌ర్గాలే కీల‌క పాత్ర పోషించాయి. అయితే పార్టీలో కొన్ని వర్గాల నేతల చర్యలతో బడుగు బలహీన వర్గాల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ నేపథ్యంలోనే వారు 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు చూశారు. అందుకే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది.

ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలతో పాటు ఈ వర్గాలకు ప్రాధాన్యం పెంచుతున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీలో నుంచి జిల్లా, నియోజకవర్గ కమిటీల‌లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా పార్టీలో కష్టపడిన నేతలను గుర్తిస్తుంటే…. నియోజకవర్గ స్థాయిలో ఉన్న కొందరు నేతలు మాత్రం సదరు బీసీ నేతలను అవమానపరిచే చర్యలు చేస్తుండటం ఆ వర్గాలకు మింగుడు పడటం లేదు. పార్టీలో కొన్ని వ‌ర్గాల నేత‌ల‌కు క‌ష్ట‌ప‌డ‌క‌పోయినా, పార్టీలు మారినా సులువుగా ప‌ద‌వులు వ‌చ్చేస్తుంటాయి. కానీ బీసీ, ఇత‌ర వ‌ర్గాల నేత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డితే కాని ఉన్న‌త ప‌ద‌వులు పొంద‌లేరు.

అస‌లు విష‌యంలోకి వెళితే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి దాస‌రి శ్యామ్ చంద్ర శేషుకు పార్టీ నేత‌ల నుంచే అడుగ‌డుగునా అవ‌మానాలు త‌ప్ప‌డం లేదు. విద్యార్థి ద‌శ‌నుంచే పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన శేషు ఆంధ్రా యూనివ‌ర్సిటీ టీఎన్ఎఫ్ అధ్య‌క్షుడిగా కూడా సుధీర్ఘ‌కాలం పాటు ప‌నిచేశారు. చంద్ర‌బాబుతో క‌లిసి ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. పార్టీ కోసం శేషు ప‌డిన క‌ష్టం చంద్ర‌బాబుకు స్వ‌యంగా తెలుసు. అందుకే గ‌త యేడాది ప్ర‌క‌టించిన పార్టీ రాష్ట్ర క‌మిటీలో ఆయ‌న‌కు రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

శేషుకు రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సొంత పార్టీ నేత‌ల నుంచే ఏదో ఒక ఇబ్బంది త‌ప్ప‌డం లేదు. చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో మున్సిపాల్టీగా ఉన్న జంగారెడ్డిగూడెం ప్రాంత నాయ‌కులు శేషుపై పార్టీ కేంద్ర కార్యాల‌యంలో లెక్క‌కు మిక్కిలిగా ఫిర్యాదులు చేశారు. అయితే వాస్త‌వాలు ఏంటో తెలుసు కాబ‌ట్టి.. వాటిని కేంద్ర కార్యాల‌యం లైట్ తీస్కొంది. అయినా అక్క‌డ కొంద‌రు నేత‌లు త‌మ‌ను కాద‌ని శేషుకు ఈ ప‌ద‌వి రావ‌డం ఏంట‌ని క‌సితో శేషును టార్గెట్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. జంగారెడ్డిగూడెంలో వార్డు మెంబ‌ర్లుగా గెల‌వ‌ని నేత‌ల‌కు సైతం రాష్ట్ర క‌మిటీలో చోటు కావాల‌ని రాద్దాంతాలు చేస్తున్నారు.

బ్యాన‌ర్లో రాష్ట్ర కార్య‌ద‌ర్శికి చోటు ఇవ్వ‌రా…
చివ‌ర‌కు తాజాగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఓ మండ‌ల పార్టీ వేసిన బ్యాన‌ర్లోనూ అంద‌రు నేత‌ల‌కు చోటు క‌ల్పించి.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏకైక రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఉన్న శేషు ఫొటో వేయ‌కుండా అవ‌మానించారు. చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం కామ‌వ‌ర‌పుకోట మండ‌ల పార్టీ త‌ర‌పున వేసిన బ్యాన‌ర్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర మండ‌లాల అధ్య‌క్షుల ఫొటోల‌తో మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల ఫొటోలు ఉన్నా.. శేషు ఫొటో లేదు.

పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీల‌క నేత‌గా ఉన్న బీసీ నేత విష‌యంలో ఈ వివ‌క్ష ఏంటో పార్టీలో బీసీల‌కే అర్థం కావ‌డం లేదు. జంగారెడ్డిగూడెంలో కూడా ఇలాంటి అవ‌మానాలే ఎదురైనా ఫొటో ముఖ్యం కాదు.. అధినేత ఇచ్చిన బాధ్య‌త ముఖ్యం అని.. పార్టీ కోసం ప‌నిచేస్తున్నారు. మామ‌లూగానే బీసీల‌కు ఎలాగూ కుర్చీలు వేయ‌రు… క‌నీసం ప్రొటోకాల్ కూడా పాటించ‌రా ? అని పార్టీలో బీసీ వ‌ర్గాలు భ‌గ్గుమంటున్నాయి.

పార్టీ నేత‌ల నుంచే ఎన్ని అవ‌మానాలు ఎదురైనా కూడా శేషు మాత్రం త‌న ప‌నితీరుతో అధినేత ద‌గ్గ‌ర మంచి మార్కులు వేయించుకుంటున్నారు. బీసీల్లో బ‌ల‌మైన గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన శేషు పార్టీలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ఏక‌తాటిమీద‌కు తీసుకు వ‌చ్చేందుకు త‌న వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. అలాంటి నేత‌ను నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు ప‌లు విధాలుగా అవ‌మానించ‌డం పార్టీకే చెడ్డ పేరు తెచ్చేలా ఉంది. ఇలాంటి చ‌ర్య‌ల‌కు అధిష్టానం చెక్ పెట్టాల్సి ఉంది.