బాలకృష్ణ ‘అఖండ’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: అఖండ
నటీనటులు: బాలకృష్ణ, శ్రీకాంత్, ప్రెగ్యా జైస్వాల్, పూర్ణా, జగపతి బాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
సంగీతం: థమన్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
రిలీజ్ డేట్: 02-12-2021

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గతేడాదే రావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో సైతం అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన అఖండ ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
అనంతపూర్ నేపథ్యంలో ఈ సినిమా కథ మొదలవుతుంది. శ్రీనివాస్(బాలయ్య) ఓ రైతుగా, కుటుంబానికి ప్రాముఖ్యతను ఇచ్చే వ్యక్తిగా మనకు ఈ సనిమాలో కనిపిస్తాడు. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా, శ్రీనివాస్ అక్కడ వాలిపోతాడు. ఇక ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రవణ్య(ప్రెగ్యా జైస్వాల్) ఆ ఊరిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. వరదరాజులు(శ్రీకాంత్) ఈ అక్రమ మైనింగ్ దందా చేస్తుంటాడు. కట్ చేస్తే.. శ్రీనివాస్ ఈ మైనింగ్ కారణంగా ఊరిజనం మరణిస్తున్న సంగతి తెలుసుకుని అతడికి ఎదురెళ్తాడు. ఈ క్రమంలో బాలయ్యను జైలులో పెట్టి్స్తాడు వరదరాజులు. ఇక ఇక్కడ అఘోరా అయిన అఖండ(బాలయ్య) ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మరింత రసవత్తరంగా మారుతుంది. అసలు ఈ అఖండ ఎవరు..? అతడికి శ్రీనివాస్‌కు ఉన్న సంబంధం ఏమిటి..? వరదరాజులు అంతం చూసేది ఎవరు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
అఖండ చిత్రంపై మొదట్నుండీ అంచనాలు క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలకృష్ణతో కలిసి పనిచేయడమే అని చెప్పాలి. ఈ కాంబోలో వచ్చిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. దీంతో ఆటోమాటిక్‌గా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను వారి అంచనాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో చిత్ర యూనిట్ పూర్తిగా సక్సె్స్ అయ్యింది. బాలయ్య-బోయపాటి కాంబో అంటే బ్లాక్‌బస్టర్ ఖాయమని మరోసారి అఖండ చిత్రంతో రుజువైంది.

ఇక అఖండ చిత్రం విషయానికి వస్తే.. ఈ సినిమా ఫస్టాఫ్‌లో ఓ రైతు పాత్రలో బాలయ్యను చూపించిన విధానం, అతడు అన్యాయాన్ని ఎదురించి, ఊరిజనం కోసం నిలబడే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఇక అక్రమ మైనింద్ దందాలో విలన్‌ వరదరాజులుగా శ్రీకాంత్ తనదైన మార్క్ వేసుకున్నాడని చెప్పాలి. తన వ్యాపారానికి అడ్డుగా ఉన్న అధికారులను హతమారుస్తూ అరాచకాలు సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చిన లేడీ ఐఏఎస్‌ను కూడా వరదరాజులు అడ్డు తప్పించాలని చూస్తాడు. అయితే ఆమెకు తోడుగా శ్రీనివాస్ ముందుండి మైనింద్ దందాను ఎదురించాలని చూస్తాడు. కానీ వరదరాజులు తన పలుకుబడితో శ్రీనివాస్‌ను జైలుకు పంపిస్తాడు.. ఇక్కడే అఖండ ఎంట్రీ ఇస్తూ ఓ అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

అటు సెకండాఫ్‌లో అఖండ పాత్రను పీక్స్‌లో చూపించాడు దర్శకుడు బోయపాటి. అఘోరా పాత్రలో బాలయ్య నటవిశ్వరూపం మనకు కనిపిస్తుంది. అన్యాయాలను ఎదురించే అఖండ ఎట్టకేలకు శ్రీనివాస్‌ను కలుసుకుంటాడు. అయితే వీరిద్దరు కలిసి వరదరాజులు అక్రమ మైనింగ్ సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేశారనేది మనకు సెకండాఫ్‌లో చూపించారు. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు, బాలయ్య చెప్పే డైలాగులతో ఈ సినిమా పవర్‌ప్యాక్డ్‌గా ముగుస్తుంది.

మొత్తానికి నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖండ చిత్రం వారి ఆశలకు ఏమాత్రం తక్కువగా కాకుండా ఉండటంతో వారికి ఈ సినిమా నిజంగానే మాస్ జాతర అని చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్, ఆయన ఎనర్జీకి కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులు సలాం కొట్టాల్సిందే. ఓవరాల్‌గా చూస్తే, అఖండ చిత్రం కరోనా నేపథ్యం తరువాత టాలీవుడ్‌కు అదిరిపోయే బూస్టప్‌ను ఇచ్చిందని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అఖండ చిత్రంలో మనకు బాలయ్య తప్ప మరెవరూ కనిపించరు. అంతలా తన స్క్రీన్ ప్రెసెన్స్‌తో బాలయ్య చెలరేగిపోయాడు. ఈ సినిమాలో డ్యుయెల్ రోల్ అయినా కూడా బాలయ్య తనదైన పర్ఫార్మెన్స్‌తో సినిమాను ఒంటిచేత్తో లాక్కొచ్చాడు. ఇక ఈ సినిమాలో విలన్‌గా శ్రీకాంత్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంత నెగెటివ్ పాత్రలో శ్రీకాంత్‌ను చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతారు. హీరోయిన్‌గా ప్రెగ్యా జైస్వాల్ తన పాత్ర మేర బాగా నటించింది. మిగతా నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించి మెప్పించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
అఖండ చిత్ర టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు బోయపాటి శ్రీను గురించి. ఆయన లాస్ట్ మూవీ డిజాస్టర్‌గా మిగలడంతో, ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌తో బౌన్స్ బ్యా్క్ కావాలనే కసితో ఈ సినిమా కోసం పనిచేశాడు. ఆయన కష్టం మనకు ఈ సినిమా చూస్తున్నంత సేపు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను ఎక్కడా సైడ్ ట్రాక్ కాకుండా జాగ్రత్త పడటంతో బోయపాటి సక్సెస్ అయ్యాడు. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో బలం. ప్రతి ఫ్రేం, ప్రతి సీన్‌ను చాలా బాగా చూపించారు. థమన్ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్. ముఖ్యంగా అఖండ పాత్ర కోసం ఆయన ఇచ్చిన బీజీఎం గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు సూపర్బ్‌గా ఉన్నాయి.

చివరగా:
అఖండ – నందమూరి అభిమానులకు నిజమైన మాస్ జాతర!

రేటింగ్:
3.5/5.0