తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?

తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్‌లో అనేక హిట్స్‌ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు అందరూ తెలుగు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రులయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు తెలుగు స్టార్ హీరోలు తమవంతు సాయంను అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని వరద బాధితుల పునరావాసం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వగా.. తాజాగా తారక్ బాటలో మరో స్టార్ హీరో కూడా తన మంచి మనసును చాటుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏపీ వరద బాధితుల సహాయార్థం తనవంతు సాయంగా రూ.25 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఆయన ఈ మొత్తాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్లు తెలిపాడు. ఏపీలో వరద కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అంటూ బన్నీ తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇక ఈ క్రమంలో మిగతా హీరోలు, రాజకీయ నేతలు కూడా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని బన్నీ పిలుపునిచ్చాడు. అటు సినిమాల విషయానికి వస్తే, బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Share post:

Latest