నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించారు. ఇక భారీ అంచనాల నడుము డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.
బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి టేకింగ్, తమన్ అందించిన మ్యూజిక్.. ఈ మూడూ అఖండ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణాలు అయ్యాయి. అలాగే విడుదలై దాదాపు ఇరవై రోజులు గడుస్తున్నా ఇంకా పలు చోట్ల సాలిడ్ కలెక్షన్స్ రాబడుతున్న అఖండ.. తాజాగా మరో నయా రికార్డ్ ను సృష్టించింది.
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(IMDB)లో 2021 సంవత్సరానికి గానూ అఖండ చిత్రం భారతదేశపు అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా చిత్రం కానప్పటికీ.. అఖండ 23%తో నంబర్ 1 స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఇక ఐఎమ్‌డిబి వారు భారతదేశంలో ఈ ఏడాది అత్యంత జనాదరణ పొందిన టాప్ 5 తెలుగు సినిమాల లిస్ట్ తీసింది. అందులో అఖండ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత పవన్ కళ్యాన్ వకీల్ సాబ్(16%), వైష్ణవ్ తేజ్ ఉప్పెన(16%), నవీన్ పొలిశెట్టి(12%), రవితేజ క్రాక్(8%) చిత్రాలు వరసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇక అఖండ సాధించిన ఈ ఘనతతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు, జైబాలయ్య అంటూ సోషల్ మీడియాలో ఆయన్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కాగా, అఖండ తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.