హీరో సూర్య పై పరువు నష్టం దావా కేసు.. ఎవరు వేశారంటే..!

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు సైతం మూటగట్టుకుంటోంది. ముందుగా ఈ సినిమాలో హిందీ భాషను కించపరిచారంటూ విమర్శలు రాగా.. ఆ తర్వాత సినిమాలో వన్నియర్లకు వ్యతిరేకంగా ప్రస్తావన తీసుకు వచ్చారని ఆ కుల సంఘం నాయకులు విమర్శలు చేశారు. తమిళనాడులో పీఎంకే పార్టీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి హీరో సూర్య ను కొట్టిన వారికి లక్ష రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఇప్పుడు తాజాగా జై భీమ్ సినిమా పై మరో వివాదం చెలరేగింది. వన్నియర్ల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుథా అరుల్ మోళి తమిళనాడు చిదంబరంలోని కోర్టులో హీరో సూర్య పై పరువు నష్టం దావా వేశారు. హీరో సూర్య,దర్శకుడు జ్ఞానవేల్, నిర్మాత జ్యోతిక, ఈ సినిమాను ప్రదర్శించిన ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ పై సెక్షన్ 153, 153a,499, 500,503,504 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమకు చిదంబరం కోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని ఆ సంఘం నాయకులు హెచ్చరించారు. కాగా జై భీమ్ సినిమా పై వివాదాలు చెలరేగుతుండటం పట్ల సూర్య అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూర్యాకు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు తమిళ సినీ ఇండస్ట్రీ కూడా సూర్యకు మద్దతుగా నిలుస్తోంది. ఒక మంచి సినిమా చేసిన సూర్యపై విమర్శలు చేయవద్దని పలువురు బహిరంగంగా విన్నవించారు.