`సిరివెన్నెల` సీతారామశాస్త్రి క‌న్నుమూత‌..విషాదంలో టాలీవుడ్‌!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి(66) కొద్ది సేప‌టి క్రిత‌మే క‌న్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్ప‌ట‌ల్‌లో చేరిన ఆయ‌న‌.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన మూడు రోజులకే సీతారామశాస్త్రి మృతి చెంద‌డం సినీ ప్ర‌ముఖుల‌ను తీవ్రంగా క‌ల‌చివేస్తోంది

మ‌రోవైపు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన అభిమానులు.. ఆయ‌న మ‌ర‌ణ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మ‌కు శాంతి చేకూరాని ఆకాంక్షిస్తున్నారు.

1986లో విడుద‌లైన ‘సిరివెన్నెల‌’ చిత్రంతో గేయ ర‌చ‌యిత సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన సీతారామ‌శాస్త్రి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఆయ‌న.. గ‌త మూడున్న‌ర దశాబ్దాలుగా ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. ఈ క్ర‌మంలోనే అనేక అవార్డుల‌ను, రివార్డుల‌ను త‌న ఖాత‌లో వేసుకున్నారు.