కొంప ముంచిన మంచు.. ట్రక్కును ఢీకొని 18 మంది దుర్మరణం..!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మంది వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవదీప్ శ్మశాన వాటిక వైపు బయలుదేరారు.

వేగంగా వెళ్తున్న ఈ వాహనం నదియా జిల్లాలోని హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును అత్యంత బలంగా ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెటాడోర్ అతి వేగంగా ప్రయాణించడంతోపాటు దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా డ్రైవర్ కు రోడ్డు కనిపించక వాహనం అదుపు తప్పి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నదియా జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

Share post:

Latest