కారు కావాలా.. కియా కార్నివాల్ ఉందిగా..

పార్టీ అధినేతలకు, ప్రభుత్వ పెద్దలకు కోపం, ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలియదు.. అర్థం కాదు.. కోపం వచ్చిన వెంటనే ప్రేమ పొంగుకొస్తుంది.. ప్రేమ చూపిన మరుక్షణమే కోపంగా మారిపోతారు. అందుకే వారిని అర్థం చేసుకోవడం కష్టం. సరే అనడం తప్ప ఏమీ చేయరాదు. ఇంతకీ అసలు విషయమేమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కియా కార్ కార్నివాల్ అంటే ఎందుకో ప్రేమ ఎక్కువైన్నట్లుంది. కారు అంటేనే కియా కార్నివాల్.. ఇక ప్రపంచంలో అంతకుమించి కార్లున్నాయా.. దానిని కాక దేనిని కొనాలి అన్నట్లుంది ఆయన వ్యవహార శైలి. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కారు కొందామని అధికారులు ప్రతిపాదన పంపడమే తరువాయి.. కియా కార్నివాల్ కొనేయండి అని అప్రూవ్ చేస్తున్నారట. అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ ఇవే కార్లు మంజూరవుతున్నాయి.

ఇటీవల జూన్ లో 32 కియా కార్లను కొనుగోలు చేసింది ప్రభుత్వం. వాటిని జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లుగా ఉన్న వారికి కేటాయించారు. ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్లకు వాటిని సర్ ప్రైజ్ గిఫ్ట్ గా అందజేశారు. సమావేశం అయిన తరువాత 32 కార్లు ప్రగతి భవన్ లో పార్క్ చేశారు. సమావేశం ముగిసిన అనంతరం అధికారులకు కార్ కీలను అందజేయడం అధికారులకు షాక్ కు గురైనంత పనైంది. ఆఫీసర్లు వారి కళ్లను వారే నమ్మలేకపోయారు.. దాదాపు రూ.35 లక్షల విలువ చేసే కారుకు రూ.15 కోట్లను వెచ్చించారు. ఇటీవల టీఎస్ఆర్టీసీ చైర్మెన్ గా నియమితులైన బాజిరెడ్డి గోవర్ధన్ కు కూడా కియా కార్నివాల్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. 2018లో చైర్మెన్ గా ఉన్న సోమారపు సత్యనారాయణ కోసం టీఎస్ఆర్ టీసీ టయోటా ఇన్నొవా కారును కొనుగోలు చేసింది. ఆ కారు కండిషన్ కూడా ఇపుడు బాగుంది. మరి అటువంటపుడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఎందుకు కొనాలి అనేది ప్రశ్న. ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉంటే.. ఇన్ని లక్షలు పెట్టి కారు అవసరమా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అయినా.. డబ్బు మన జేబులోది అయితే కదా బాధపడేందుకు..

Share post:

Popular