టాలీవుడ్ లో రిలీజ్ డైలమా.. తగ్గేదేవరు.. నెగ్గేదేవరు..!

కరోనా నియంత్రణలోకి రావడం, థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అన్ని రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోని పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన చిత్రాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందు డేట్ ప్రకటించిన సినిమాలకు అడ్డంగా మరికొన్ని సినిమాలు అప్పటికప్పుడు డేట్లు ప్రకటించుకొని దూరేస్తున్నాయి.

దీంతో సినిమాల మధ్య క్లాష్ నెలకొంది. థియేటర్ల కొరత కూడా ఏర్పడుతోంది. మనకెందుకులే ఈ పోటీ అనుకున్న నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేస్తూ ఉండగా.. ముందు తామే కదా విడుదల తేదీ ప్రకటించింది.. మధ్యలో వచ్చి దూరడం ఏమిటని.. మరికొందరు ముందు ప్రకటించిన డేట్ లోనే వస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు.దీంతో సినిమాల విడుదలపై సందిగ్ధం నెలకొంది.

నిర్మాతలు అయితే పండుగల సందర్భంగా తాము ప్రకటించిన డేట్ లోనే తమ సినిమాలు విడుదల అవుతాయని చెబుతున్నప్పటికీ చివరికి ఏ సినిమా విడుదల అవుతుందో.. ఏ సినిమా వాయిదా పడుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది.ముందుగా సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేస్తున్నట్లు భీమ్లా నాయక్, సర్కార్ వారి పాట, రాధే శ్యామ్ మేకర్స్ ప్రకటించారు.

అయితే అనూహ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీ విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాత ప్రకటించారు. ఇక్కడే తలనొప్పులు మొదలయ్యాయి. ముగ్గురు అగ్ర హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదలవుతుండగా.. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాను అప్పటికప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించి విడుదల చేయడం ఏంటనే విమర్శలు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో క్లాష్ ఎందుకని మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా విడుదలను ఆ చిత్ర నిర్మాతలు వాయిదా వేశారు.అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మేకర్స్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను కూడా వాయిదా వేయాలని ఆ సినిమా నిర్మాతను కోరుతున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన ఐదు రోజులకు జనవరి 12న భీమ్లా నాయక్ విడుదలైతే ఆర్ఆర్ఆర్ కలెక్షన్లకు దెబ్బ పడుతుందని వారు అంటున్నారు.

అయితే భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేసేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన నిర్మాత నాగ వంశీకి స్పష్టం చేయడంతో ఆయన తమ సినిమా ముందు ప్రకటించిన డేట్ కే విడుదల చేస్తామని.. ఇందులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు.
దీంతో రాజమౌళి రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ ను కలిసి ఎలాగైనా భీమ్లా సినిమాను వాయిదా వేయాలని కోరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో అసలు సంక్రాతికి భీమ్లా నాయక్ విడుదల అవుతుందా.. లేదా.. అనే సందిగ్ధం నెలకొంది. అలాగే డిసెంబర్ లో అఖండ, గని, శ్యామ్ సింగరాయ్, పుష్ప సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే గని సినిమా డిసెంబర్ 2న, పుష్ప సినిమాను 17 వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే అనూహ్యంగా బాలకృష్ణ – బోయపాటి అఖండ మూవీ డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గని సినిమాను 24 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాతలు వెల్లడించారు.

అయితే 24వ తేదీన నాని శ్యామ్ సింగరాయ్ విడుదలవుతోంది. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయితే కలెక్షన్లకు దెబ్బ పడే అవకాశం ఉండడంతో గని సినిమా విడుదల వాయిదా వేసే యోచనలో ఆ మూవీ మేకర్స్ ఉన్నారు. జనవరి మూడో వారానికి ఆ సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు.

నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న బంగార్రాజు సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ భారీ చిత్రాలతో పోటీ ఎందుకని ఆ సినిమా మేకర్స్ అనుకుంటున్నారు. అందువల్లే ఇటీవల బంగార్రాజు టీజర్ విడుదల అయినప్పటికీ అందులో విడుదల తేదీని ప్రకటించలేదు. ఇలా సినిమాల విడుదల లో పోటీ నెలకొనడంతో ప్రకటించిన తేదీ కి ఏ సినిమా విడుదల అవుతుంది..ఏ సినిమా వాయిదా పడుతుంది.. అనేది సందిగ్ధంగా మారింది.