ఐఏఎస్ వద్దు..రాజకీయాలే ముద్దు?

పాతికేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం.. వివిధ హోదాల్లో ప్రజాసేవ.. గ్రూప్ 1 అధికారిగా ఎంపిక.. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీఓగా విధి నిర్వహణ, 2007లో ఐఏఎస్ హోదా.. డ్వామా పీడీ, హుడా సెక్రెటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం, ఆ తరువాత కన్ఫర్మ్డ ఐఏఎస్ గా పదోన్నతి.. జేసీగా పనిచేసిన వ్యక్తి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్ గా ప్రజాసేవ.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.. ఆయనే వెంకట్రామరెడ్డి.. ఇందులో ఏముంది.. అంత చెప్పుకోతగ్గ విశేషం అని అనుకోకండి.. కలెక్టర్ ఉన్న ఈయన ఇపుడు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు.. కేసీఆర్ అంటే ఈయనకు వల్లమాలిన అభిమానం.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహా వ్యక్తి అని ఫీలవుతుంటారు.. అందుకే కలెక్టర్ గా ఎందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు.. అందుకే కలెక్టర్ పదవికి రాజీనామా చేసేశారు. తన రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు స్వచ్చంద పదవీ విరమణ చేస్తున్నట్లు లేఖ అందజేశారు. ఆయన లేఖను అలా అందజేశారో, లేదో ఇలా ఆమోదించారు. సో.. వెంకట్రామరెడ్డికి రాజకీయాల్లో చేరేందుకు ఎటువంటి అడ్డంకులు లేవన్నమాట.

మరో ముఖ్య విషయం ఏమంటే.. ఈయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకా పదవీ కాలం సంవత్సరం ఉండగానే స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడం..చేయాలనుకోవడం మంచిదేగానీ.. నిజంగా ప్రజల కోసం పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతారు. లేకపోతే.. పార్టీ నాయకుడిగా మిగిలిపోతారు.. అంతే.. మొన్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్వచ్చందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లో చేరారు. బీఎస్పీ కండువా కప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ.. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి వెంకట్రామరెడ్డి గులాబి కండువా కప్పుకొని టీఆర్ఎస్ నాయకుల వెంట తిరగడం తప్ప అంతకు మించి చేసే కార్యక్రమాలేవీ ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.