దృశ్యం-2 రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: దృశ్యం-2
నటీనటులు: వెంకటేష్, మీనా, కృతిక, సంపత్ రాజ్, నదియా తదితరులు
సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్
దర్శకత్వం: జీతూ జోసెఫ్
రిలీజ్ డేట్: 25-11-2021

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం-2 ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్నా కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. నవంబర్ 25న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తు్న్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను ఈ సినిమా ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
రాంబాబు(వెంకటేష్) తన కుటుంబానికి గతంలో జరిగిన అన్యాయాన్ని మరిచిపోయి ఆనందంగా గడుపుతుంటాడు. అయితే తన భార్య జ్యోతి(మీనా)తో పాటు తన కూతుళ్లు తమ గతాన్ని తరుచూ తలుచుకుంటూ భయపడుతుంటారు. ఈ క్రమంలో రాంబాబు కుటుంబానికి పక్కింటివారితో కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అంతేగాక గతంలో జరిగిన హత్య కేసును పోలీసులు తిరిగి విచారణ చేపడతారు. ఈ క్రమంలో రాంబాబు తన కుటుంబాన్ని ఈ కేసు నుండి ఎలా తప్పిస్తాడు? అసలు రాంబాబు ఈ హత్య కేసును ఎలాంటి మలుపులు తిప్పుతాడు? చివరకు రాంబాబుకు శిక్ష పడుతుందా? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
మలయాళంలో తెరకెక్కిన దృశ్యం-2 చిత్రానికి పూర్తి రీమేక్‌గా ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక గతంలో వచ్చిన దృశ్యం సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా ఉండటంతో సగటు ప్రేక్షకుడు ఈ సినిమా కథనంతో పూర్తిగా థ్రిల్ అవుతాడని చెప్పాలి. ఫస్టాఫ్‌లో హీరో, అతడి ఫ్యామిలీని చూపించిన దర్శకుడు, వారు మళ్లీ ఇరకాటంలో ఎలా పడతారు అనే అంశాలన చాలా చక్కగా ప్రెజెంట్ చేశాడు. అయితే రాంబాబు ఫ్యామిలీ మళ్లీ కష్టాల్లో పడటానికి కారణం ఎవరనే విషయాన్ని మనకు ప్రీక్లైమాక్స్‌లో రివీల్ చేస్తాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా సెకండాఫ్‌లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంటుంది.

కాగా సెకండాఫ్‌లో రాంబాబు ఈ కేసు నుండి ఎలా తప్పించుకుంటాడు, అతడు పోలీసుల బారి నుండి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రణాళికలను రచిస్తాడనేది చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమాలో ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఫుల్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఇలాంటి సీన్స్‌ను వారు ఏమాత్రం ఊహించలేకపోతారు. మొత్తానికి సెకండాఫ్‌లో కూడా దర్శకుడు తన నైపుణ్యాన్ని చూపించి ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

ఓవరాల్‌గా ఓ ఆసక్తికరమైన సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉండాలో, దృశ్యం-2 చిత్రం అలాగే ఉందని చెప్పాలి. ఈ సినిమాను మలయాళంలో చూడనివారు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఇక మలయాళంలో చూసిన వారు కూడా ఈ సినిమాను తెలుగులో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుందని ఫీల్ అవుతారు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
‘దృశ్యం’ సినిమాలో నటించిన చాలా మంది నటీనటులు ఈ సీక్వెల్ చిత్రంలో కూడా కనిపిస్తారు. ఇక వెంకటేష్ తొలి భాగంలో లాగానే ఇప్పుడు కూడా తన కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ తీసుకుంటాడనేది మనకు ఈ సినిమాలో బాగా చూపించాడు. ఓ తండ్రిగా, తన పిల్లలకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు వెంకటేష్ చేసే ప్రయత్నాలు మనకు బాగా నచ్చుతాయి. అటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంపత్ రాజ్ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. మిగతా వారు తమ పరిధి మేర బాగానే నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
మలయాళంలో దృశ్యం-2 చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ కథలో ఎలాంటి మార్పులు చేయకుండా తెలుగులోనూ మంచి కంటెంట్ ఉన్న సినిమాగా దృశ్యం-2ను ప్రెజెంట్ చేశాడు. ఆయన రాసుకున్న కథను ఏమాత్రం పక్కదారి పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని, ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం కూడా మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. నిర్మాణ విలువలు ఈ సినిమాను మరింత రిచ్‌గా చూపించాయి.

చివరగా:
దృశ్యం 2 – రాంబాబు మామూలోడు కాదు.. అంతకుమించి!

రేటింగ్:
3.5/5.0

Share post:

Latest