సీఎం ఎన్టీఆర్.. బాబు ఇలాకాలో పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను చూసి ఇతర స్టార్ హీరోలు సైతం అవాక్కవుతంటారు. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు దుర్భాషలాడటంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. అటు తమ ఇంటి ఆడపడుచును రాజకీయాల్లోకి లాగడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా సమక్షంలో ఖండించారు.

అటు ఎన్టీఆర్ కూడా ఈ వివాదంపై స్పందించగా, ఆయన వైసీపీ నేతలను సాఫ్ట్ కార్నర్‌తో వార్నింగ్ ఇచ్చారని టీడీపీ నేతలు ఆయనపై మండిపడ్డారు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ పలు రకాల విమర్శలు చేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్ టీడీపీ నేతలపై గుర్రుగా ఉన్నారు. ఇక తాజాగా కుప్పంలోని ఓ థియేటర్‌లో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ వేసుకున్న తారక్ ఫ్యాన్స్, ఆ థియేటర్లో రచ్చ రచ్చ చేశారు. సీఎం ఎన్టీఆర్ అంటూ అక్కడ వారు చేసిన హంగామా మామూలుగా లేదు.

బాబులకే బాబు తారక్ బాబు.. సీఎం ఎన్టీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ ఆ థియేటర్‌లో చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎప్పటికైనా టీడీపీ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే సత్తా కేవలం జూనియర్ ఎన్టీఆర్‌కు ఉందని వారు ఈ సందర్భంగా అంటున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా ఎన్టీఆర్‌కు తోడుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పార్టీ మనుగడకు తారక్ వీలైనంత త్వరగా పార్టీలోకి రావాలని వారు కోరుతున్నారట. మరి నిజంగానే తారక్ టీడీపీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి పార్టీకి గతవైభవాన్ని తీసుకొస్తాడా, లేక రాజకీయాలకు దూరంగా ఉంటూనే తన మద్దతును కొనసాగిస్తాడా అనేది చూడాలి.

Share post:

Latest