బాబు టూర్.. కన్నీళ్లు తుడవడానికా.. పెట్టుకోవడానికా..

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితుల కష్టాలను చూడడానికి స్వయంగా బయలుదేరి వెళ్లారు. కడప జిల్లాలో ఒక రోజంతా పర్యటించారు. చిత్తూరు జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాలలో వరద తాకిడికి దెబ్బతిని నానా కష్టాలు పడిన ప్రజలను ఆయన పరామర్శిస్తారు. షెడ్యూలు ప్రకారం వరద బాధితుల కన్నీళ్లు తుడవడానికి చంద్రబాబునాయుడు వెళ్లినట్లే కనిపిస్తూ ఉంది కానీ, వాస్తవంలో ఊరూరూ తిరిగి తాను కన్నీళ్లు పెట్టుకోవడానికి ఆయన వెళుతున్నట్లుగా ఉంది!
వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించారు- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయినప్పటికీ కడపలో నష్టాన్ని హెలికాప్టర్‌లో నుంచి పరిశీలించారు. ఈ ఒక్క పాయింటు తనకు బీభత్సమైన మైలేజీ ఇచ్చేస్తుందని చంద్రబాబునాయుడు అనుకుని ఉంటారు. గత ఎన్నికల్లో తనకు సీట్లు ఇవ్వకపోయినా కూడా.. కడప జిల్లాలో తాను స్వయంగా పర్యటిస్తే ప్రజలంతా తన అభిమానులు అయిపోతారని కూడా ఆశపడి ఉంటారు.

జగన్ తన హెలి టూర్ లో స్వయంగా బాధితులతో మాట్లాడలేదు. ఆ ఒక్క విషయంలో చంద్రబాబునాయుడు బెటర్! అయితే బాధితులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన చేసిన డిమాండ్లు గొంతెమ్మ కోరికలు లాగా కనిపిస్తాయి. ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించగా- అది చాలదు పాతిక లక్షలు ఇవ్వాల్సిందే అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడం ఆశ్చర్యకరం! ఆయన ప్రభుత్వ హయాంలో ఎంత పరిహారాలు ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది.
అలాగే బాధితులు వర్షం కారణంగా కోల్పోయిన వస్తువులన్నింటినీ ప్రభుత్వం కొత్తవి కొని ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు చాలా విచిత్రంగా డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు జరిగిన నష్టం పూర్తిస్థాయిలో పూడ్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు. హుదుద్ లాంటి పెద్ద తుపానును చూసిన చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు అప్పట్లో ప్రతి ఇంటికీ వస్తువులు సమస్తం కొని ఇచ్చారా? ఇదేం పిచ్చి డిమాండో అర్థం కావడం లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే- ‘నా భార్యని అవమానించారు’ అంటూ మొన్నటి అసెంబ్లీ ఎపిసోడ్ గుర్తుకు తెచ్చారు. అవమానం నిజమో కాదో గానీ.. దానికి సంబంధించిన ఆయన అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్నారు. తను ఆశించే సానుభూతిని సంపాదించారు. అయితే ఇప్పుడు టూర్ లో కూడా ప్రజలే ముందు మాట్లాడటం ఇంకో ఎత్తు!
ఇదంతా చెప్పి- ప్రజల కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావించాలంటే కూడా తన భార్యని అవమానించారు గనుక.. వెళ్లడం లేదని బుకాయించడం చాలా హేయం. ఒకవేళ అవమానించారనే అనుకుందాం. భార్యని అవమానించారు గనుక.. చంద్రబాబుకు మద్దతుగా ఓట్లు వేసిన ప్రజలందరు ఏ నమ్మకంతో ఓట్లు వేశారో, ప్రతిపక్షనేత స్థానంలో కూర్చోబెట్టారో ఆ నమ్మకాన్నికూడా వదిలేస్తారా అనేది ప్రశ్న.
ఆయన వైఖరి చూస్తే ప్రజల కన్నీళ్లు తుడవడానికి వెళ్ళారా- లేదా తన కన్నీటిని చూడమని అందరినీ బతిమాల డానికి వెళ్లారా అనే సందేహం కలుగుతోంది!