ఆలూ..లేదు.. చూలూ లేదు..

బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంలో ఉన్నట్టున్నాడు.. ఎంత ఉత్సాహమంటే.. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికలు జరిగినట్లు.. ఫలితాలు వచ్చినట్లు.. బీజేపీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్నంటు.. కమలం నాయకులు ఇంకా ఓ అడుగు ముందుకేసి తొలి సంతకం ఉచిత విద్యపై చేస్తామని చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది..అయితే బీజేపీ మాత్రం ఇప్పటినుంచే గ్రౌండ్‌ వర్క్‌ మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాదులో రెండు రోజుల పాటు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆ పార్టీ నేతలు చేసిన ప్రసంగాలు కార్యకర్తలను అయోమయంలో పడేశాయి. కిందిస్థాయి కార్యకర్తలకు తెలుసు.. స్థానికంగా ఏం జరుగుతోందో? ప్రజల భావాలు ఎలా ఉంటాయో? వారు ఓట్లు ఎవరికి వేస్తారో? హుజూరాబాద్‌లో కమలం పార్టీ గెలిచిందో..లేదో ఆ పార్టీ నాయకుల కాళ్లు భూమిపై నిలవడం లేదు. అక్కడ గెలిచింది సాదా..సీదా నాయకుడు కాదు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. టీఆర్‌ఎస్‌లో ఉండ బయటకు వచ్చిన ఈటల రాజేందర్‌.

హుజూరాబాద్‌ అంటే ఈటల.. ఈటల అంటే హుజూరాబాద్‌ అని అందరికీ తెలుసు. అధికారికంగా ఆ స్థానం టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉన్నా అనధికారికంగా మాత్రం హుజూరాబాద్‌ ఈటలదే. ఆయనకు అంత బలముంది అక్కడ. అందుకే విజయం సాధించాడు. ఈ విషయం బీజేపీ పెద్దలకు తెలియందేంకాదు. అధికారంలోకి వస్తామని చెప్పడం మంచిదే. రాజకీయ పార్టీలు కూడా అలాగే చెబుతాయి. కిందిస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ‘మనదే విజయం.. మేమే గెలుస్తాం.. ’ అనే మాటలు మీడియా ముందు పేల్చుతుంటారు. అవి ఎంతవరకు వాస్తవమో అందరికీ తెలుసు. అయితే.. మరీ చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉచిత విద్యపై సంతకం చేస్తామని చెప్పడమే వింతగా ఉంది. ఇప్పటికైనా బీజేపీ నాయకులు కాస్త నేలపై నడిస్తే వాస్తవాలు తెలుస్తాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Share post:

Latest