కనగరాజ్ కు మళ్లీ పదవి.. ఈసారైనా ఉంటుందో.. ఊడుతుందో..!

November 30, 2021 at 11:56 am

తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా..కొన్నేళ్ళ క్రితం ఏపీ ఎస్ఈసీగా నియమితులైన ఆయన కోర్టు తీర్పు కారణంగా కొద్ది రోజుల్లోనే ఆ పదవిని కోల్పోయారు. తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం మరొక పదవి కట్టబెట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే కొనసాగారు. అయితే ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో కరోనా వ్యాప్తి మొదలైందని ఎన్నికలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారు. దీనిపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అంటూ.. ఆరోపణలు చేసింది.

ఆ తర్వాత ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ ను ఆ పదవి నుంచి తొలగించి తమిళనాడుకు చెందిన న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించింది. తన పదవి తొలగింపుపై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లగా ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మళ్లీ నిమ్మగడ్డ రమేష్ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు. కనగరాజ్ ఎస్ఈసీ పదవి నుంచి అర్ధాంతరంగా దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కనగరాజ్ ని పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ గా పదవి ఇచ్చింది. అయితే ఆ పదవి కూడా కోర్టులో నిలబడలేదు.

తాజాగా ప్రభుత్వం ఆయనకు మరో పదవి అప్పగించింది. పీడీ చట్టం సలహా మండలిని ప్రభుత్వం నియమించింది. ఆ సలహా మండలి చైర్మన్ గా ఉమ్మడి హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీవరెడ్డిని చైర్మన్ గా నియమించింది. సభ్యుడిగా కనగరాజ్ ని నియమించింది. పీడీ యాక్ట్ సలహామండలి అంటే ముందస్తుగా ఎవరిని నిర్బంధంలోకి తీసుకోవాలో.. సలహా ఇచ్చే వ్యవస్థ. కాగా కనగరాజ్ కు ఈ పదవైన స్థిరంగా ఉంటుందా లేదా ఎవరైనా కోర్టుకు వెళతారా అనేది చూడాల్సి ఉంది.

కనగరాజ్ కు మళ్లీ పదవి.. ఈసారైనా ఉంటుందో.. ఊడుతుందో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts