ఆ నలుగురికీ స్పెషల్ క్లాస్!

విద్యార్థులు అందరికీ కలిపి పాఠం చెబితే అది క్లాసు. కొందరు మొద్దు విద్యార్థులను లేదా కొందరు అత్యంత ఇంటెలిజెంట్ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి.. వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి విడిగా పాఠం చెబితే అది స్పెషల్ క్లాస్. రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరికీ ఉమ్మడిగా క్లాస్ తీసుకుంటే.. ఆ నలుగురికి మాత్రం స్పెషల్ క్లాస్ తీసుకున్నారుట. నాయకులు కంగారెత్తిపోయేలా.. మాట్లాడారట.

ఇంతకీ ఆ నలుగురు ఎవరు అనుకుంటున్నారా? రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి. జీవిఎల్ నర్సింహారావు ఈ నలుగురి వ్యవహార సరళి మీద అమిత్ షా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తమాషా ఏమిటంటే.. ఈ నలుగురు నాయకులు కూడా అమరావతి రాజధాని అనే ఒకే ఒక్క విషయంలోనే బుక్కయిపోయారు. అమరావతికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకే అమిత్ షా చేత తలంటు పోయించుకున్నారు.

అమరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారన సంగతి తన దృష్టికి రాగానే అమిత్ షా వారికి అనుకూలంగా మాట్లాడారు. అయితే ఆయన అమరావతి రాజధానికి అనుకూల వైఖరితో ఉన్నారనే సంగతిని గ్రహించడంలో నాయకులు విఫలం అయ్యారు. పార్టీ అనుకూలంగా తీర్మానం చేసిన తర్వాత.. దానికి కట్టుబడి ఉండకపోతే ఎలా అనే అంశం మీద వారందరికీ క్లాస్ పీకారు.

ఈలోగా అమరావతి రైతుల పోరాటం ముసుగులో ఒక కులం వారే పోరాటం చేస్తున్నారని, వాళ్లు కాంట్రాక్టు కూలీలనే వ్యాఖ్యలు పార్టీ నాయకులు చెప్పారు. దీంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులైనట్లు సమాచారం. ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు వారికి మద్దతు ఇచ్చి తీరాల్సిందేనని, ఇలాంటి సాకులు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.

అలాగే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెళ్లను బీజేపీ కార్యక్రమాలకు రానివ్వకుండా నిషేధించడం మీద కూడా అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో విష్ణువర్దన్ రెడ్డికి అవమానం జరిగినంత మాత్రాన మీడియా సంస్థను దూరం పెట్టడం కరెక్టు కాదని ఆయన అన్నారు. వారు బీజేపీ వ్యతిరేక మీడియా సంస్థ అని నాయకులు చెప్పబోయినా పట్టించుకోలేదు. వాళ్లను కూడా పిలిచి తీరాల్సిందే అని చెప్పారు.

ఏపీ బీజేపీలో వ్యక్తులతో విభేదాల వల్ల పార్టీ నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదని, ఇక్కడ పార్టీని సిద్ధాంతాలు కాకుండా వ్యక్తులు నడిపిస్తున్నట్టుగా ఉందని అమిత్ షా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

Share post:

Popular