బ్రహ్మానందంకు అరుదైన గౌర‌వం..దేశంలోనే ఏకైక న‌టుడిగా రికార్డ్‌!

కామెడీ కింగ్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌రాని ముద్ర వేసుకున్న కన్నెగంటి బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దాదాపు నలభై ఏళ్ల నుంచీ సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో రికార్డుల‌ను, అవార్డులను అందుకున్న బ్ర‌హ్మానందం.. గిన్నిస్ బుక్ లోనూ త‌న పేరును లిఖించుకున్నారు.

దాదాపు 1000కి పైగా సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించుకున్న బ్ర‌హ్మానందం.. తాజాగా ఓ అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. బ్రహ్మానందంపై హెచ్.ఆర్ చంద్రం శతకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఆదివారం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌లో బ్రహ్మానందం మిత్రులు స్వ‌యంగా ఆవిష్కరించారు.

ఈ విష‌యం తెలుసుకున్న బ్ర‌హ్మానందం ఆనందం వ్య‌క్తం చేశారు. అలాగే భారతదేశ చరిత్రలోనే ఒక నటుడు గురించి శతకం రచించటం గ‌ర్వంగా ఉందని ఆయ‌న పేర్కొన్నారు.. అయితే ఒక నటుడిపై 108 పద్యాలతో శతకాన్ని రచించడం భారత చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నేప‌థ్యంలో దేశంలో ఏ న‌టుడికీ ద‌క్క‌ని అరుదైన గౌర‌వాన్ని త‌న సొంతం చేసుకుని బ్రహ్మానందం రికార్డ్ సృష్టించారు.

కాగా, బ్ర‌హ్మానందం ఫిబ్రవరి 1, 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేసిన ఆయ‌న‌.. అత్తిలిలో లెక్చరర్ గా పనిచేశారు. బ్ర‌హ్మానందం మొదటి సినిమా జంద్యాల గారు తెర‌కెక్కించిన‌ `అహానా పెళ్లంటా’. `అరగుండు వెధవా` అని కోటతో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ్ర‌హ్మానందం అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ.. కామెడీ రారాజుగా ప్రేక్ష‌కుల మ‌దిలో ప్ర‌త్యేక‌మైన స్థాన‌న్ని సంపాదించుకున్న విష‌యం తెలిసిందే.