కేసీఆర్ మదిలో.. ముందస్తు ఎన్నికలు

‘‘నేను ఉద్యమాలనుంచి వచ్చిన వాడిని.. పదవులు నాకు లెక్కకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశానో మీకు తెలుసు.. ’’ అని మొన్న ఇందిరాపార్కులో జరిగిన ధర్నా లో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతోంది. అంటే.. కేసీఆర్ మదిలో ఏదో ఉంది.. రాజీనామాలు చేసి ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశమూ ఉందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఏదైనా మాట్లాడారంటే దానికి ఓ లెక్క ఉంటుందని ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఒక బాధైతే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదనే విషయం రైతులకు సమాధానం చెప్పలేకపోవడం ఒక కారణం. రైతులు ఇబ్బంది పడితే.. దానిని కేంద్రం మీదకు తోసేస్తే సరిపోతుందని ఇతర నాయకులు అనుకుంటారేమో కానీ.. కేసీఆర్ అలా అనుకోడు. ఎందుకంటే రైతులు, ప్రజలు కేంద్రం వల్ల ఇబ్బంది పడితే శిక్ష మోదీకి కాదు.. కేసీఆర్ పై ఉంటుంది.

కేసీఆరే తమను పట్టించుకోలేదనే భావన వారిలో వస్తుంది. బీజేపీ అనేది జాతీయ పార్టీ. తెలంగాణలో ఇప్పటికిప్పుడే పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు.. అయితే ఓట్ల శాతాన్ని తగ్గించే ప్రభావముంది. ఇదీ గులాబీ బాస్ కు బాగా తెలుసు. అందుకే నెపాన్ని ఎంత మోదీమీదికి వేసినా నష్టం మాత్రం గులాబీ పార్టీకే జరుగుతుంది. ఈ ఆలోచనల మధ్య ముందస్తుకు వెళితే ఎలా ఉంటుందని సారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగక ముందే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు కేసీఆర్ ను బాగా అసంత్రుప్తి పరిచాయి. ఎంత చేసినా అక్కడి ఓటర్లను ఆకట్టుకోలేకపోయాం. దళిత బంధు ప్రారంభించినా ఓటమి తప్పలేదు. ఈ వ్యతిరేకత మరో రెండేళ్లు ఉంటే.. ఎలా? మొదటికే మోసం వస్తుందనే బాధ కేసీఆర్ మదిని తొలుస్తోంది. అందుకే..2022 సంవత్సరం మధ్యలో ముందస్తు ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.