మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు

November 24, 2021 at 1:26 pm

తెలంగాణలో వరి ధన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ ధర్నా కూడా చేశారు. పార్టీ శ్రేణులు మొత్తం ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అంతటితో ఆగం.. ఢిల్లీ వెళ్లి మాట్లాడతాం.. కొంటారా? కొనరా? అని అడుగుతాం అని కేసీఆర్ బలంగా చెప్పారు. అన్నట్లుగానే కేసీఆర్ అండ్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ఆదివారం హస్తినకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు అక్కడ ఏమేం చేయాలో రూట్ మ్యాప్ డిసైడ్ చేసుకున్నారు. ఏం మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? చర్చలకు ఎవరెవరు వెళ్లాలి? అనే విషయాలు కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ తదితరులు మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైంది. సాయంత్రం 6.40 గంటలకు ప్రారంభమైన మీటింగ్ రాత్రి 7.50 వరకు సాగింది. అంటే గంటా పది నిమిషాల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపాయి. అయితే.. సమస్యకు పరిష్కారం మాత్రం లభించలేదు. మళ్లీ ఇంకోసారి కలుద్దాం అని పీయూష్ చెప్పారు.

ఇదంతా బాగానే ఉంది కానీ.. పీయూష్ గోయల్ ను కలిసేందుకు వెళ్లిన మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎంపీ కే.కేశవరావు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు దాదాపు మూడున్నర గంటలపాటు ఎదురు చూశారు. మంత్రుల టీమ్ అటు వెళ్లంగానే.. అపాయింట్ మెంట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే.. వీరు అనుకున్నట్లు మాత్రం హస్తినలో జరగలేదు. ముందుగానే అపాయింట్ మెంట్ కోరిన టీ.టీమ్ కు మధ్యాహ్నం 3 తరువాత రావాలని పీయూష్ కార్యాలయ సిబ్బంది చెప్పారు. చెప్పిన టైముకు కరెక్టుగానే వీరు వెళ్లారు. అయితే.. షాకింగ్ న్యూస్.. కేంద్ర మంత్రి పీయూష్ బిజీగా ఉన్నారు. ఇప్పుడే కలవడం కుదరదు.. మరో కార్యక్రమంలో ఉన్నారు. మీరు కాసేపు వెయిట్ చేయండి అని ఆఫీస్ సిబ్బంది చెప్పారు. సరేలే.. కాసేపే కదా అని వెయిట్ చేశారు.. అరగంట.. గంట.. రెండు గంటలు గడిచిపోయాయి కానీ మంత్రినుంచి పిలుపులేదు. వీరిలో అసహనం పెరిగిపోతోంది.. చేసేదిలేక అలాగే ఎదురు చూశారు. చివరకు మూడున్నరగంటల అనంతరం అంటే సాయంత్రం 6.40 గంటలకు మంత్రి వచ్చారు.. గంటపాటు చర్చలు జరిపారు. చివరకు మాత్రం ఫలితం లేదు.. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ మాత్రం రాలేదు.. ఇదీ నిన్నటి కేటీఆర్ టీమ్ చేసిన చర్చా కార్యక్రమం.

మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts