కైకాల సత్యనారాయణతో మాట్లాడా… చిరంజీవి ట్వీట్..ఆయన ఏ విధంగా స్పందించారంటే..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిన్న సాయంత్రం అపోలో ఆస్పత్రి వైద్య బృందం విడుదల చేసిన బులిటెన్ లో  పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు, తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఆందోళన చెందుతున్నారు.

కాగా ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఒక ట్వీట్ చేశారు. కైకాల సత్యనారాయణ తిరిగి కోలుకొని మన మధ్యకు వస్తారంటూ.. ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలియగానే ఆయన్ను ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ను ఫోన్లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియా స్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా.. మళ్లీ త్వరలో ఇంటికి తిరిగి రావాలని ..ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని ..నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్ అప్ సైగ చేసి థాంక్యూ యూ..అని చూపించినట్లుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు.

కైకాల సత్యనారాయణ సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ.. ఆయన అభిమానులు..శ్రేయోభిలాషులు అందరితోనూ ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కైకాల సత్యనారాయణ కొద్దిరోజుల కిందట కూడా తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన అనారోగ్యం పాలవడంతో సినీ ఇండస్ట్రీ లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Share post:

Latest