స్టార్డం వచ్చాక అర్ధంతరంగా చనిపోయిన హీరోలు వీరే ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. స్టార్ గా మంచి పొజిషన్లో ఉన్న పునీత్ 46 ఏళ్లకే కన్నుమూయడంతో కన్నడ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక పునీతే కాదు స్టార్డమ్ వచ్చాక పునీత్ లాగే చనిపోయిన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి సర్జా గత ఏడాది గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయనకు చని పోయే సరికి 39 ఏళ్లు మాత్రమే.

అలాగే కన్నడ యువ హీరో సంచారి విజయ్ ఈ ఏడాది జూన్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తెలుగులో అగ్ర హీరోగా ఎదుగుతాడని అందరూ భావించిన ఉదయ్ కిరణ్ అతి చిన్నవయసులోనే అర్ధంతరంగా తనువు చాలించాడు.

వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడం, వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలతో ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సంచలనం రేపింది. ఆయన అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది. ఉదయ్ మృతితో ఒక అగ్ర హీరోను ఇండస్ట్రీ కోల్పోయింది.

మాస్ సినిమాలతో రియల్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీహరి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించాడు. ఎంతో ఫిట్నెస్ గా ఉండే శ్రీహరి లివర్ సమస్య తలెత్తి 49 ఏళ్లకే అకస్మాత్తుగా కన్నుమూశాడు. శ్రీహరి మృతిని కూడా అభిమానులు తట్టుకోలేక పోయారు. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా.. సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యశో సాగర్.. ఆ సినిమా విడుదలైన కొన్ని నెలలకే ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

అలాగే తెలుగులో ప్రేమికుల రోజు సినిమాతో గుర్తింపు పొందిన కునాల్ వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలతో ముంబైలో ఉరి వేసుకుని చనిపోయాడు. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరో సుశాంత్ ఆత్మహత్య దేశంలోని సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం కారణంగానే సుశాంత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన అచ్యుత్, విజయసాయి మృతి కూడా కలచివేసింది. అచ్యుత్ బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు. ఆతర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటాడు. అచ్యుత్ 41 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయాడు. రవిబాబు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విజయసాయి 40 ఏళ్లకే మృతిచెందాడు. వ్యక్తిగత జీవితంలో నెలకొన్న సమస్యల కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Share post:

Popular