శర్వానంద్, సిద్ధార్థ్‌ల ‘మహాసముద్రం’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: మహాసముద్రం
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, అను ఎమ్మాన్యుయెల్, రావు రమేష్, తదితరులు
దర్శకత్వం: అజయ్ భూపతి
సంగీతం: చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రిలీజ్ డేట్: 14-10-2021

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, చాలా రోజుల తరువాత తెరకెక్కించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్‌తో పాటు చాలా రోజుల తరువాత మరో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఈ సినిమా అంచనాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కాగా ఈ సినిమా నేడు(అక్టోబర్ 14న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
డిప్రెషన్‌లో ఉండే అర్జున్(శర్వానంద్) తన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఈ క్రమంలో ఫ్లాష్‌బ్యాక్‌లో తన స్నేహితుడు ఐపీఎస్‌కు ప్రిపేర్ అవుతున్న విజయ్(సిద్ధార్థ్) కొన్ని కారణాల వల్ల డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కుంటాడు. ఇక్కడి నుండి వారిద్దరి మధ్య నెలకొన్న విబేధాల ఎక్కడి వరకు వెళ్తాయి అనేది మనకు ఈ సినిమా కథగా చూపించారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ ప్రేమించే స్మిత(అను ఇమ్మాన్యుయెల్) వారిద్ధరికి ఓ ట్విస్ట్ ఇస్తుంది. స్నేహితులుగా ఉన్న హీరోలు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇక కొన్ని కారణాల వల్ల అర్జున్ కూడా డ్రగ్స్ మాఫియాలోకి అడుగుపెడతాడు. ఆ తరువాత వీరిద్దరి మధ్య ఏమైంది? స్మిత ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి? అర్జున్ ప్రేమించిన అమ్మాయి మహా(అదితి రావు హైదరి)కి ఏమైంది? చివరకు అర్జున్, విజయ్‌లు స్నేహితులుగా మారుతారా లేదా? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు అజయ్ భూపతి తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ను ఎంత కల్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇక తన తొలి సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు మహాసముద్రం చిత్రాన్ని కూడా కల్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలను తీసుకుని అజయ్ భూపతి ఎలాంటి సినిమాను తెరకెక్కించాడో తెలియాలంటే మాత్రం సినిమా థియేటర్లకు వెళ్లాల్సిందే. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో హీరోల పాత్రల ఇంట్రొడక్షన్ మొదలుకొని, కొన్ని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్, అందులో రొమాంటిక్ ట్రాక్‌లను మనకు చూపించారు చిత్ర యూనిట్. కాగా ఫస్టాఫ్ కాస్త సాగతీతగా అనిపించినా, అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ ఈ సినిమాను ఆకట్టుకునే విధంగా మలిచాయి. ఇక హీరోల మధ్య వచ్చే ఓ చిన్న అపోహ వల్ల వారిద్దరు ఎలా విరోధులగా మారారనేది బాగా చూపించారు. కాగా ఓ మంచి ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమా సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

అటు సెకండాఫ్‌లో ఈ సినిమాలోని అసలైన యాక్షన్‌ను చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా హీరోల మధ్య సాగే వార్ ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇక హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఇచ్చే ట్విస్ట్, అదితిరావు హైదరీ స్క్రీన్ ప్రెసెన్స్‌లు సెకండాఫ్‌కు బలంగా మారాయి. అయితే ఓ ఊహించని ట్విస్ట్‌తో వచ్చే క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌ను ప్రేక్షకుల ఊహకందని విధంగా దర్శకుడు చూపించాడు. మొత్తానికి మహాసముద్రం చిత్రాన్ని మొదట్నుండీ కల్ట్ మూవీగా ప్రెజెంట్ చేస్తున్న చిత్ర యూనిట్, ఆ అంశాలను పుష్కలంగా వాడారని చెప్పాలి.

దర్శకుడు అజయ్ భూపతి ఎంచుకున్న సబ్జెక్ట్ రొటీన్‌గా అనిపించినా, ఆయన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మేజర్ ప్లస్ అని చెప్పాలి. అటు సంగీత పరంగా చేతన్ భరద్వాజ్ సంగీతం కూడా ఈ సినిమాకు మరో మేజర్ అసెట్. ముఖ్యంగా ఇంటెన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లలో వచ్చే బీజీఎం సూపర్బ్‌గా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ దసరా రేసులో తొలి సినిమాగా రిలీజ్ అయిన మహాసముద్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అర్జున్ పాత్రలో శర్వానంద్ కిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. తనలోని ఎమోషన్‌ను కళ్లతో పలికించిన తీరు శర్వాలోని మేటి నటుడిని మనకు మరోసారి ఈ సినిమాలో చూసే అవకాశం కలిగింది. ఇక యాక్షన్ సీన్స్‌లోనూ ఈ హీరో తనదైన మార్క్‌తో అదరగొట్టాడు. కాగా మరో హీరో సిద్ధార్థ్ తెలుగు తెరపై చాలా రోజుల తరువాత కనిపించడంతో అందరి చూపులు ఆయనపైనే ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర ఖచ్చితంగా సిద్ధార్థ్‌కు అదిరిపోయే కమ్‌బ్యాక్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు సరికొత్త సిద్ధార్థ్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది. అటు హీరోయిన్లుగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్‌లు కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్‌లు ఇవ్వగా, జగపతి బాబు, రావు రమేష్, కేజీఎఫ్ రామ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా స్క్రీన్‌ప్లేతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన రాసుకున్న కథను రాసుకున్నట్లుగానే చూపించి వావ్ అనిపించాడు. ఇక కొన్ని సీన్స్‌లో ఆయన టేకింగ్ మనకు సూపర్బ్‌గా నచ్చుతుంది. ముఖ్యంగా యాక్షన్, రొమాంటిక్స్ సీన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం బాగుంది. కాగా ఈ సినిమాకు మరో మేజర్ బలంగా నిలిచింది ఈ సినిమా సినిమాటోగ్రఫీ. రాజ్ తోట తన కెమెరా పనితనంతో ప్రతి సన్నివేశాన్ని సూపర్బ్‌గా మలిచాడు. ఇక ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అదిరిపోయింది. పాటలతో పాటు బీజీఎం కూడా గూస్‌బంప్స్ తెప్పించింది. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుండటంతో ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అను నిర్మాణ విలువలు కూడా బాగుండటంతో ఈ సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

చివరగా:
మహాసముద్రం – చూసినోళ్లకు చూసినంత!

రేటింగ్
3.0/5.0