కేటీఆర్ కు ఛాన్స్.. ఎర్రబెల్లికి నో ఛాన్స్.. ఇదేంది సారూ..!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన కుమారుడు కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదేంటి.. కేటీఆర్ .. ఆయన కుమారుడు.. మరి కుమారుడికి కాక ఎవ్వరికి ప్రాధాన్యం ఇస్తారు అని కూడా అనుకుంటారు. అయితే అభిమానం, ప్రేమ అనేవి మన వ్యక్తిగత విషయాలు.. వాటిని వ్యక్తిగతంగానే చూడాలి. అధికారికంగా వాటిని బహిర్గతం చేయరాదు. అవకాశం అనేది అందరికీ ఇవ్వాలి.. కుమారుడికి ఇచ్చి.. ఇతరులకు ఇవ్వకపోతే పక్షపాతం చూపుతున్నారు అంటారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ .. కేటీఆర్ కు పెద్దపీట వేసి మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పక్కనపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు.. అధికార పార్టీకి చెందిన వారు, మంత్రులు సమాధానం చెబుతున్నారు. వీటితోపాటే చర్చా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. గురువారం అసెంబ్లీలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై చర్చ జరిగింది. ముందుగా పట్టణ ప్రగతిపై సంబంధిత శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రసంగించారు. ఆయన ప్రసంగం అనంతరం అధికార పక్ష సభ్యులు చప్పట్లే.. చప్పట్లు.. ఆ తరువాత పల్లె ప్రగతిపై ప్రసంగించాలి. అందుకే తన ప్రసంగ పాఠాన్ని తీసుకున్న సంబంధిత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే.. సీఎం కేసీఆర్.. ఎర్రబెల్లి వైపు చూసి.. తాను మాట్లాడతానన్నట్లు సైగ చేశాడు. దీంతో ఎర్రబెల్లి సైలెంట్ అయ్యాడు.. కేసీఆర్ ప్రసంగించారు. ఇదీ జరిగింది. అయితే.. ఎర్రబెల్లికి చాన్స్ ఇవ్వకపోవడంతో పార్టీలో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. దాదాపుగా కేసీఆర్ సమకాలీకుడే. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. అయితే.. ఇపుడు మాత్రం ఎక్కడో వెనుకపడిపోయాడు.

Share post:

Latest