ఉన్నది మూడు నెలలే… ఆ తరువాత?

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కొత్త టెన్షన్ మొదలైంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో అంటే మరో మూడు నెలల్లో ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అదేంటి.. ఆమె ఎమ్మెల్సీగా గెలిచింది గత సంవత్సరమే కదా .. ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నిజామాబాద్ లో కవిత గెలిచింది ఉప ఎన్నికల్లో.. అప్పటికే సమయం మించిపోయింది. ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన తరువాత తండ్రి కేసీఆర్ ..తన కూతురును చట్టసభల్లోకి ఎలాగైనా పంపాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఏ పదవీ లేని కవితను మండలికి పంపించారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఎమ్మెల్సీ టర్మ్ ముగియనుంది. అంతకుముందు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఈ ఎన్నిక నిర్వహించారు. భూపతిరెడ్డి 2016 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. భూపతిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు నిర్వహించడం.. కవిత గెలవడం జరిగిపోయాయి.

ఇక మూడు నెలలు మాత్రమే పదవీ కాలం ఉండటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై పార్టీలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. కేసీఆర్ ఏం చేయబోతున్నారో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తరువాత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీచేయాలని కూతురును కోరుతారా? లేక 2024 ఎన్నికల వరకు ఖాళీగా ఉంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయిస్తారా? అని ఊహించుకుంటున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీచేసి బీజేపీ చేతిలో ఓడిపోయిన కవిత తిరిగి 2014లో అదే ప్రాంతం నుంచి పోటీచేసి విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే వచ్చే సంవత్సరం జనవరి వరకు ఆగాల్సిందే.