ఎలాంటి మార్పు లేదంటున్న కేజీఎఫ్ 2

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలకు ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఒక భాషలో తెరకెక్కిన చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసి తమ సత్తా చాటుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ కోవలోనే వచ్చిన కన్నడ భారీ యాక్షన్ మూవీ కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, కన్నడ హీరో యశ్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం యావత్ ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి యాక్షన్ డోస్‌ను మరింత పెంచుతూ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో కేజీఎఫ్ 2 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని సౌత్ ఆడియెన్స్‌తో పాటు బాలీవుడ్ జనం కూడా ఆసక్తిగా ఉన్నారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 14, 2022లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

అయితే ఆ సమయానికి ఇండియన్ వైడ్‌గా పలు భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో కేజీఎఫ్ 2 రిలీజ్ అనుకున్న సమయానికి ఉంటుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. కానీ తమ సినిమాను అనౌన్స్ చేసిన సమయానికే రిలీజ్ చేస్తున్నట్లు కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్ మరోసారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కేజీఎఫ్ 2 అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. దీంతో కేజీఎఫ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన చిత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుకున్న సమయానికి రావాలని వారు ఆశగా చూస్తున్నారు.