వాళ్లు సరే.. మరి వీరెందుకు వచ్చారు..?

వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య విజయమ్మ హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోలేదు. షర్మిల పార్టీకి పెద్దగా మద్దతూ ఎవరూ ప్రకటించారు. అందరూ తమకు వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధం మాత్రం గుర్తుచేసుకున్నారంతే. ఈ సమావేశానికి టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ సీనియర్ నాయకులను ఆహ్వానించినా వారు తెలివిగా తప్పించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్న నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి,ఉండవల్లి అరుణ్ కుమార్, గిరీష్ సంఘి తదితరులు హాజరయ్యారు. వీరి హాజరును పార్టీ కూడా పెద్దగా పట్టించుకోదు. వీరితో పాటు రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా హాజరయ్యారు. శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ గురవారెడ్డి, న్యాయ నిపుణులు జంధ్యాల రవిశంకర్, జర్నలిస్టులు కేఆర్ మూర్తి, ఏబీకే ప్రసాద్ తదితరులు కూడా వచ్చారు.

అయితే ఆశ్చర్యకరవిషయమేమంటే బీజేపీలో ఉన్న నాయకులు కూడా హాజరు కావడం. మాజీ ఎంపీ, హుజూరాబాద్ బీజేపీ ప్రచార ఇన్చార్జి జితేందర్ రెడ్డి, బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరుకావడమే ఇపుడు హాట్ టాపిక్.

ఈ ముగ్గరు విజయమ్మ ఏర్పాటు చేసిన సమావేశంలో పాలుపంచుకోవడమంటే బీజేపీలో ఏదో జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. పార్టీలో వీరు ముభావంగా ఉన్నారు అనేందుకు ఇదే సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశానికి వెళ్లకూడని అన్ని పార్టీల నాయకులు చెప్పినా బీజేపీ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వెళ్లారేమో.. అని అనుకుంటున్నా.. రాజకీయ కారణాలు లేందే నాయకులు అడుగుకూడా ముందుకు వేయరు. మరి ఎందుకు వెళ్లినట్లు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.