అనారోగ్యం అయితే ఏంటీ వ్యాక్సినేషన్ ముఖ్యం.. తీవ్ర పని ఒత్తిడితో ఏఎన్ఎం మృతి..!

September 27, 2021 at 3:16 pm

మామూలుగానే వైద్యారోగ్య సిబ్బందికి చేతినిండా పని ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆసుపత్రులకు వచ్చే రోగులను చూసుకోవడానికే సమయం సరిపోతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పుడైతే మొదలైందో.. అప్పటినుంచి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ సేకరించడం.. కరోనా వ్యాక్సిన్ వేయడంలో తలమునకలై గడుపుతున్నారు. మామూలుగా తమ విధులు నిర్వహిస్తూనే అదనంగా కరోనా సంబంధిత పనులు కూడా చేస్తున్నారు.

దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి అధికమైనప్పుడు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ కల్లా దేశంలోని అందరికీ వ్యాక్సిన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఆరోగ్య సిబ్బంది సెలవులు లేకుండా పని చేయాల్సి వస్తోంది. కరోనా నిరోధక పనుల్లో పాల్గొని వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోయారు కూడా. తాజాగా ఓ ఏఎన్ఎం బాధ పడుతూ సెలవు కూడా దొరక్క మృతి చెందింది.

పెబ్బేరు కు చెందిన భాగ్యలక్ష్మి(42) ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హెల్త్ బాగోలేదు.. అని సెలవు కావాలని..ఉన్నతాధికారులను భాగ్యలక్ష్మి అడుగగా వ్యాక్సినేషన్ ఉందని సెలవు ఇవ్వడం కుదరదని తెలిపారు.
దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరైన భాగ్యలక్ష్మి సాయంత్రం వరకు విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళింది.

ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే ఆమెకు రక్తపు వాంతులు అయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న భాగ్యలక్ష్మిని వనపర్తి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భాగ్యలక్ష్మి ఆరు నెలల కిందట కరోనా బారిన పడి కోలుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర ఒత్తిడి వల్లే భాగ్యలక్ష్మి మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపించారు.

అనారోగ్యం అయితే ఏంటీ వ్యాక్సినేషన్ ముఖ్యం.. తీవ్ర పని ఒత్తిడితో ఏఎన్ఎం మృతి..!
0 votes, 0.00 avg. rating (0% score)