పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమావేశంపై సర్వత్రా చర్చ

జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ చాలా రోజుల తరువాత రాజకీయ చర్చల్లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల రాజకీయాల గురించి ఆలోచించినట్లు లేరు. అదేంటో.. ఉన్నట్టుండి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ కూడా భేటీలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్ లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరితో చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు వీరు సమావేశమయ్యారు. అయితే ఏం చర్చించారు? ఎందుకు సమావేశమయ్యారు? అనే విషయాలు మాత్రం చర్చల్లో పాల్గొన్న వారికే తెలుసు.

కొద్ది కాలంగా బీజేపీ, జేఎస్పీ పార్టీలు ఎడమొహం..పెడమొహంగా ఉంటున్నాయి. ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేస్తామని చెప్పిన పవన్ ఆ తరువాత వారిని పట్టించుకోలేదు. బీజేపీ కూడా అలాగే వదిలేసింది. అయితే ఇపుడు జరిగిన సమావేశం ఉత్తుత్తి సమావేశమేనని, మేము విడిపోలేదు..కలిసే ఉన్నామని ఇరు పార్టీల కార్యకర్తలకు సంకేతమివ్వడానికే అని తెలిసింది. టీడీపీ వైపు జనసేన చూస్తోంది అని ఇటీవల వదంతులు రావడంతో.. ఆ పార్టీ నాయకులకు కూడా క్లియర్ గా సంకేతాలిచ్చినట్లయింది. ప్రస్తుతానికి పవన్ పార్టీ రాజకీయంగా పెద్ద కార్యక్రమాలేమీ నిర్వహించడం లేదు. వెయిట్ అండ్ సీ పద్దతిలో ఆయన ముందుకెళుతున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది.. కదా అనే భావనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు సమాచారం. 2023 ఎన్నికల నాటికి ఈ ఇరు పార్టీల మధ్య ఓ అవగాహన వస్తే దాని ప్రకారం పొలిటికల్ స్టెప్స్ ఉంటాయి. అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రణాలికలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిసింది.