ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం..

ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఈటల రాజేందర్ హూజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజాదీవెన యాత్ర ప్రారంభించారు. ఈ నియోజకవర్గాన్ని నేనే అభివ్రుద్ధి చేశా.. నిరంతరం అందరికీ అందుబాటులో ఉన్నా.. ఏ పార్టీలో ఉన్నా నేను మీ బిడ్డనే అంటూ యాత్ర ప్రారంభించారు. పలువురు బీజేపీ నాయకులు కూడా ఈయనకు మద్దతుగా నిలిచారు. అస్వస్థతకు గురై కాలికి చికిత్స చేయించుకున్న తరువాత కూడా ఈటల పాదయాత్రను ఆపలేదు. ఈటల పాదయాత్ర చేస్తున్నారు కానీ ఈయన వెంట బీజేపీ కేడర్ పెద్దగా రావడం లేదు. ఈటల అనుచరులు, అభిమానులు, సానుభూతిపరులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈటల కూడా బీజేపీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదు.. టీఆర్ఎస్ వర్సెస్ ఈటల ఎన్నికలు అని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బీజేపీ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది.

ప్రజా ఆశీర్వాద యాత్ర : కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి ఈ యాత్ర చేపట్టనున్నారు. మోదీ ఆదేశం మేరకు కొత్త కేంద్ర మంత్రులు పర్యటన చేయనున్నారు. అందులో భాగంగా ఈనెల 16 నుంచి కిషన్ రెడ్డి యాత్ర ప్రారంభమవుతుంది. ఈనెల 20వరకు సాగే ఈ యాత్రలో పార్టీ కేడర్ కచ్చితంగా పాల్గొనాలని అంతర్గత ఆదేశాలున్నాయి. మోదీ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా పార్టీ కూడా రూట్ మ్యాప్ రూపొందించింది.

ప్రజాసంగ్రామ యాత్ర : ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే యాత్ర. ఈనెల 24 నుంచి దాదాపు 55 రోజుల పాటు యాత్ర నిర్వహించేలా కమలం పార్టీ స్కెచ్ రూపొందించింది. ఈ యాత్రకు పేరు కూడా ఈ రోజే(శుక్రవారం ) ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ..చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈ యాత్ర పేరును ప్రకటించారు. మాజీ మంత్రలు బాబూ మోహన్, చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త యాత్రలో పాల్గొనాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.