మా ఓట్లు వైసీపీ వాళ్లు చోరీ చేశారు

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేనట.. అందుకే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందట.. ఇలా అభిప్రాయపడుతున్నది రాజకీయాలు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. అంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, దీక్షలు చేపట్టి.. అనేక హామీలు ఇచ్చినందువల్ల జగన్ సీఎం సీటులో కూర్చోలేదు.. మా ఓట్ల వల్లే అన్నట్లుంది శైలజానాథ్ అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ లాగ ఉంది.. అటువంటి పార్టీని ఇపుడు బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అనధికార జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నడుంబిగించారు. అందుకే ఏపీ కాంగ్రెస్ నాయకులతో బుధవారం ఢిల్లీలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఒక్కో నాయకుడితో 10,15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. అసలు ఆ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరీ ఇంత దిగజారడానికి కారణాలేంటని ఆరా తీశారు. అందరూ ముక్తకంఠంతో.. ఏపీని విడగొట్టడం ఒక కారణమైతే.. జగన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఊరూ తిరిగాడు.. ఆయనను నమ్మారు.. అందుకే పార్టీ ఈ స్థితికి వచ్చిందని చెప్పారట.

- Advertisement -

అయినా అలా.. ఎలా వదిలేస్తాం.. భవిష్యత్తు మనదే.. అంటూ రాహుల్ గాంధీ ఏపీ నాయకులకు ఆశలు కల్పించారట. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం నాయకులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడానికి, సంస్థాగతంగా పటిష్టం చేయడానికి చర్యలు తీసుకోవాలని రాహుల్ ఆదేశించారని చెప్పారు. పార్టీకి దూరమైన అన్ని వర్గాలను తిరిగి దగ్గరికి తీసుకుంటామని, బలోపేతం చేస్తామని వారు చెప్పారు. ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తోపాటు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, చింతామోహన్, ఏపీ పార్టీ ఇన్ చార్జి ఉమెన్ చాందీ తదితరులు రాహుల్ తో సమావేశమయ్యారు. కొసమెరుపేంటంటే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీపీసీ అధ్యక్షుడు, వైఎస్ సమకాలీకుడు రఘువీరారెడ్డి మాత్రం రాకపోవడం.

Share post:

Popular