ఈశ్వరా.. ఇదేమి నిర్ణయం అంటున్న వైసీపీ కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు ఏం చేయలేక.. అధినేతను అడగలేక మిన్నకుండిపోయారు. అసలేం జరిగిందంటే.. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్లను సీఎం ఇటీవల ఎంపిక చేశారు.

అయితే వారు స్థానికేతరులు కావడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యవీడుకు చెందిన బీరేంద్రవర్మ, కాణిపాకం ఆలయ చైర్మెన్ గా చిత్తూరుకు చెందిన ప్రమీళారెడ్డిలను అధినేత ఎంపిక చేశారు. అయితే దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఎక్కడో ఉన్న వారికి ఇక్కడి పదువులు ఎలా ఇస్తారని ద్వితీయ శ్రేణి నాయకులు రుసరుసలాడుతున్నారు.

స్థానిక శాసనసభ్యులైన మధుసూదన్ (శ్రీకాళహస్తి), ఎంఎస్ బాబు (పూతలపట్టు)లు ఈ వ్యవహారంపై తమ కార్యకర్తలు, అనుచరులకు ఏం సమాధానం చెప్పాలో.. ఎలా సముదాయించాలో అర్థం కావడం లేదు. అధినేతకు చెప్పలేక.. కార్యకర్తలను బుజ్జగించలేక వారు తలపట్టు కుంటున్నారో.